Adsense

Thursday, May 29, 2025

వాల్మీకి రామాయణం-10

వసిష్ఠ ఋష్యశృంగుల  మాట ఆజ్ఞగా, వారే అగ్రగాములుగా ఒక శుభముహూర్తాన దశరథుడు అంతఃపురంనుంచి బయలుదేరి. శాస్త్రోక్తపద్ధతిలో యజ్ఞవాటికను ప్రవేశించాడు అలనాడు విడిచిపెట్టిన యాగాశ్వం ఈ సంవత్సర కాలంలో దేశాలన్నీ తిరిగివచ్చింది.

సరయూనది ఉత్తర తీరంలో యజ్ఞం ప్రారంభమయ్యింది. ఋశ్యశృంగుడు బ్రహ్మగా బత్విక్కులు అన్ని కార్యక్రమాలూ యథావిధిగా నిర్వహిస్తున్నారు.

శాస్త్ర ప్రకారం నడుస్తున్నారు. -తృతీయసవనాలు -మీమాoసా కల్పసూత్రోక్త ప్రకారంగా నిర్వహిస్తున్నారు.

ఈ హోమాలలో అహుతంకానీ స్ఖాలిత్యం కానీ ఎక్కడా
కనిపించడం లేదు. అంతా బ్రహ్మసదృశంగా మంత్ర ప్రకారం నిర్విఘ్నంగా జరుగుతోంది.

యజ్ఞం జరిగిన అన్నిరోజులలోనూ అలసిపోయినవాడుగానీ, ఆకలి గొన్నవాడుగానీ కనిపించలేదు.

అందరూ తృప్తితో ఆనందంతో గడిపారు. ఇవ్వండి ఇవ్వండి, పెట్టండి పెట్టండి అని పెద్దలు ప్రేరేపిస్తోంటే కార్యకర్తలు అన్నవస్త్రాలు పుష్కలంగా పంచిపెడుతున్నారు.

శాస్త్ర విహితంగా దశరథుడు మరియు పట్టపు మహిషి కౌసల్య  దేవితోను చేయవలసిన అన్ని క్రియలను  పూర్తి చేశాడు.

అంతా పూర్తి అయ్యింది. దక్షిణా ప్రదాన సమయం వచ్చింది. మహారాజు తన సామ్రాజ్యంలో తూర్పుభాగాన్ని హోతకు, పశ్చిమభాగాన్ని అధ్వర్యునికి, దక్షిణ భాగాన్ని బ్రహ్మకు, ఉత్తరభాగాన్ని ఉద్గాతకు దక్షిణగా సమర్పించాడు

ఈ భూమిని మేము ఏం చేసుకుంటాము, అధ్యయనాధ్యాపనాలే తప్ప మేము రాజ్యాలు మహారాజా ఏలగలమా!

దీనికి ప్రత్యామ్నాయంగా ఒక మణి, ఒక రత్నమో, ఒక గోవో , రవ్వంత బంగారమో ఏదో ఒకటి నీకుతోచినది ఇచ్చి ఈ భూమిని తీసేసుకో.

మొత్తం సామ్రాజ్యాన్ని నీవే రక్షించు. అని  ఋత్విక్కులు ఏకకంఠంగాపలికారు.

అప్పుడు దశరథుడు ఒక్కొక్కరికీ వేలసంఖ్యలో గోవులను, కోట్లలో వెండి బంగారాలను సమర్పించాడు

అందరూ తెచ్చి ఋష్యశృంగ వసిష్ఠులముందు ఆ సొమ్ములను రాశిపోస్తే వారు యథోచితంగా న్యాయంగా అందరికీ భాగాలు పంచారు.

భూరి దక్షిణలతో విప్రులనందరినీ సంతుష్టి పరిచి దశరథుడు హర్ష పర్యాకులేక్షణుడై నిలిచి సవినయంగా సభా నమస్కారం చేసాడు.

విప్రులు ఆనందంతో మనసారా ఆశీర్వదించారు. మహారాజులు తప్ప నిర్వహించలేని అశ్వమేధాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తిచేసి పాపరహితుడై దశరథుడు ప్రకాశిస్తున్నాడు

మహర్షీ! ఋష్యశృంగా! అశ్వమేధం పూర్తి అయ్యింది. కుల వర్ధనమైన మరొక యజ్ఞం ఏదయినా నీవు చేయించాలి...

( స‌శేష‌ము ).

Note. ఈ అశ్వమేధ యజ్ఞం ఓ సుదీర్ఘ ప్రక్రియ. చాలా వివరాలు వాల్మీకి కూడా అందించారు.

బాలకాండ 12,13,14 సర్గలలో  వివరించారు. అందుకే కలియుగం లో అశ్వమేధ యాగాలు నిషిద్ధం అంటారు...

సేకరణ...

No comments: