Adsense

Friday, May 30, 2025

వాల్మీకి రామాయణం - 11

మహార్షీ! ఋష్యశృంగా! అశ్వమేధం పూర్తి అయ్యింది. కుల వర్ధనమైన మరొక యజ్ఞం ఏదయినా నీవు చేయించాలి అని దశరథుడు ప్రార్థించగా...

దశరథుని ప్రార్ధనను ఋష్యశృంగుడు అంగీకరించాడు. రాజా! నీకు నలుగురు కుమారులు కల్గుతారని ఆశీర్వదించాడు.

వెంటనే ధ్యాన నిమగ్నుడయ్యాడు. కొంతసేపటికి కన్నులు తెరిచాడు మహారాజా! నీకు సంతాన ప్రాప్తికోసం

పుత్రీయమైన ఒక ఇష్టిని నిర్వహిస్తాను. ఇది అధర్వ వేద ప్రోక్తం.ఆ విధానంలో జరిపిస్తాను.

వెంటనే ఇష్టి ప్రారంభమైంది. సమంత్రకం గా తొలి ఆహుతిని ఇచ్చారు.వెంటనే బ్రహ్మాది దేవతలు తమతమ భాగాలు స్వీకరించడానికి రానే వచ్చారు...

అప్పటికే రావణాసురుడు వల్ల పడుతున్న బాధలను చతుర్ముఖ బ్రహ్మ గారి దగ్గర విన్న వించారు.

త్రిలోక కంఠకుడైన రావణుని సంహరించే ఉపాయం చేయమని ప్రార్థించారు.

ఇలా బ్రహ్మదేవుడు పలుకుతున్నపుడే అక్కడికి విష్ణుమూర్తి విచ్చేసాడు. దేవతలంతా ముక్త కంఠంతో ప్రార్థించారు

మహావిష్ణూ ! లోకహితం కోరి నిన్ను అభ్యర్థిస్తున్నాం. మహర్షి సమతేజస్కుడై శ్రద్ధాభక్తులతో పుత్రకామేష్టి చేస్తున్న ఈ దశరథ మహారాజుకు నీవు పుత్రుడుగా జన్మించు.

నిన్ను నీవే నాలుగా విభజించుకొని దశరథుని ముగ్గురు భార్యలయందు- పుత్రత్వాన్ని పొందు.

ఇలా మానవుడుగా జన్మించి అటుపైని లోకకంటకుడైన రావణాసురుని సంహరించి ముల్లో కాలకూ

దేవగంధర్వ సిద్ధ సాధ్యాప్సరో గణాలకూ ముని బృందాలకూ సుఖశాంతులు ప్రసాద్దించు మహాప్రభూ !

మా అందరికీ నీవే గతి. నీవు తప్ప మరొక దిక్కులేదు. రాక్షస సంహారంకోసమని మనుష్యలోకంపై మనసుపెట్టు అని కోరారు

దేవతలారా ! నిర్భయంగా ఉండండి. మీరు కోరినట్టే మానవజన్మ ఎత్తుతాను. సపుత్రబాంధవంగా రావణుణ్ని
సంహరిస్తాను.

కొన్ని వేల సంవత్సరాలపాటు మనుష్యలోకాన్ని పరిపాలిస్తాను. మీ మాట ప్రకారం ఈ దశరథ మహారాజునే తండ్రిగా అభిలషిస్తున్నాను.

బ్రహ్మాది దేవతలందరూ ఆనంద భరితులై శ్రీమన్నారాయనుణ్ణి భక్తి తో స్తుతించారు.

పుత్ర కామేష్టి శాస్త్రీయంగా చేస్తున్న దశరథ మహారాజుకు యజ్ఞకుండం నుంచి ఒక అద్భుతాకారం కాంతులీనుతూ దర్శనమిచ్చింది.

కృష్ణవర్ణుడు. రక్తాంబరాలు ధరించి ఉన్నాడు. ఎర్రని ముఖం. దుందుభిస్వనం. సింహపు జూలువంటి రోమాలు మీసాలు.

పొడవైన జుట్టు. సర్వశుభ లక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, శైలశ్యంగంలా సమున్నతుడు
శార్దూల సమవిక్రముడు, సూర్యతేజస్వి, అగ్నిజ్వాలా సదృశుడు.

ఆ దివ్యపురుషుని చేతులలో బంగారు పాత్ర ఉంది. దానికి వెండిమూత ఉంది.  ఆ పాత్రను ఎంతో ఆప్యాయంగా పొదివి పట్టుకొని ఉన్నాడు అందులో దివ్యపాయసం ఉంది.

దశరథా! నన్ను ప్రాజాపత్య పురుషుడంటారు. ఇదిగో ఇది దేవతలు చేసిన దివ్యపాయసం. నీ భార్యలకు
పంచిపెట్టు, పుత్రకామేష్టి సఫలం అవుతుంది.

నీకు పుత్రులు కలుగుతారు- అంటూ పాయసపాత్రను అందించాడు. మహారాజు అమితానందంతో అందుకొని భక్తిశ్రద్దలతో ముమ్మారు ఆ దివ్యపురుషునికి ప్రదక్షిణం చేసాడు.

ప్రాజాపత్య పురుషుడు పయనమయ్యాడు.
దశరథ మహారాజు పాయసపాత్రతో అంతఃపురం సమీపించాడు.

కౌసల్యను పిలిచి ఇది పుత్రీయమైన పాయసం స్వీకరించమని సగం (1/2) ఇచ్చాడు. మిగిలిన సగాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగం (1/4) సుమిత్రకు ఇచ్చాడు. తక్కిన సగాన్ని మళ్ళీ రెండు భాగాలు చేసి ఒక భాగం (1/8) కైకకు ఇచ్చాడు. మిగిలినది (1/ 8) ఆలోచించి సుమిత్రకే మళ్ళీ ఇచ్చాడు.

ముగ్గురు రాణుల ఆనందానికి అవధులు లేవు. ఎవరికి వారు పాయసం భుజించి

దివ్యతేజస్సుతో విరాజిల్లారు కొన్ని రోజులకు ముగ్గురూ గర్భవతులయ్యారు. దశరథుడు ఆనందపరవశు డయ్యాడు...

Note. వాల్మీకి రామాయణం లో బాలకాండ 15,16 సర్గలు పారాయణ చేయడం తో సంతానాన్ని పొందుతారు.

No comments: