శ్రీమన్నారాయణుడు దశరథుని ఇంట పుత్రత్వం పొందగా బ్రహ్మదేవుడు దేవతలనూ దేవర్షులనూ సమావేశపరిచి ఒక ప్రకటన చేశాడు.
దేవతలారా ! విష్ణుమూర్తికి సహాయకారులుగా ఉండే నిమిత్తం మీరంతా అప్సరఃకాంతలయందు వానర మహావీరులను సృష్టించండి.
బలశాలులు, బుద్ధిమంతులు, మాయావిదులు, కామరూపధారులు, వాయువేగులు, ఉపాయజ్ఞులు, నీతివిదులు, విష్ణుతుల్య పరాక్రములు అయిన వానర వీరులను సృష్టించండి.
ఇంతకు మునుపే నేను జాంబవంతుడనే ఋక్ష మహావీరుణ్ని సృష్టించి ఉన్నాను. ఆవలిస్తూండగా హఠాత్తుగా నా నోటినుంచి జన్మించాడు.
దేవతలూ ఋషులూ అందరూ ఈ బ్రహ్మవాక్కును శాసనంగా అంగీకరించారు. వానరరూపాలు ధరించి అప్పర కాంతలతో విహరించి వానర మహావీరులను సృజించారు.
ఇంద్రుడు వాలిని, సూర్యుడు సుగ్రీవుని, బృహస్పతి తారుని, కుబేరుడు గంధమాదనుని, విశ్వకర్మ నలుని, అగ్నిదేవుడు నీలుని,
అశ్వినీదేవతలు ద్వివిద-మైందులను, వరుణుడు సుషేణుని, పర్జన్యుడు శరభుని సృష్టించగా వాయుదేవుడు అందరిలోకీ బుద్ధిమంతుడూ
బలవంతుడూ వజ్రకాయుడూ గరుత్మత్సమానుడూ అయిన హనుమంతుణ్ని సృష్టించాడు.
వేలకు వేలుగా సృష్టింపబడిన ఈ సింహ శార్దూల పరాక్రములు నఖదంప్ట్రాయుధులై శిలా పాదపాయుధు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు.
పర్వతాలను పెళ్ళగించగలరు, సముద్రాలను కలచివేయగలరు, భూమి కుళ్ళగించగలరు, ఆకాశానికి ఎగురగలరు, మేఘాలను పట్టగలరు, మత్తమాతంగాలను ఒంటిచేతితో నిలపగలరు
గట్టిగా అరిచి - ఎగిరే పక్షులను పడగొట్టగలరు
వీరందరినీ దేవతలు గుంపులుగా విభజించి నాయకులను నియమించి భూగోళంలో దశదిశలకూ పంపించా వీరందరికీ మహానాయకుడు ఇంద్రసుతుడైన వాలి.
అతని ఆజ్ఞమేరకు అందరూ నిర్దిష్ట పర్వతారణ్యాలకు వెళ్లి పోయారు భూగోళమంతా ఆవరించారు.
సరయూ తీరం లో దశరథుడు అశ్వమేధము,పుత్రకామేష్ఠి పూర్తి చేసి దీక్ష విరమించి అయోధ్యా చేరాడు.....
పుత్రజనానాన్ని ప్రతీక్షిస్తున్నాడు......
ఆరు ఋతువులు గడచి పోయాయి.....చైత్రమాసం వచ్చింది...
( సశేషము )..
No comments:
Post a Comment