ఆరు ఋతువులు గడిచిపోయాయి.
పన్నెండవనెల. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమినాడు పునర్వసు నక్షత్రయుక్త (చతుర్ధపాదం) కర్కాటక లగ్నంలో సూర్య గురు శుక్రాంగారక శనిగ్రహాలు అయిదూ స్వోచ్చస్థానంలో ఉండగా
బృహస్పతి చంద్రులు కలిసి ఉన్న ముహూర్తంలో కౌసల్యాదేవి శ్రీరామచంద్రుణ్ని ప్రసవించింది. జగన్నాథుడు సర్వలోక నమస్కృతుడు జన్మించాడు
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేఽదితిదైవత్యే స్వోచ్చ సంస్థషు పంచసు॥
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతమ్||
కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతమ్ |
విష్ణోరర్ధం మహాభాగం పుత్ర మైక్ష్వాకువర్ధనమ్ ||..
మర్నాడు దశమి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు మీనలగ్నంలో పుష్య నక్షత్రయుక్త శుభముహూర్తంలో సూర్యాంగారకాది పంచగ్రహాలూ స్వోచ్చస్థానాల్లో ఉండగా కైకేయి భరతుణ్ని ప్రసవించింది
భరతో నామ కై కేయ్యాం జజ్జే సత్యపరాక్రమః సాక్షాద్విష్ణోశ్చతుర్చాగ స్సముదితో గుణైః
అదేరోజున సూర్యోదయం అయ్యాక ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటకలగ్నంలో సూర్యాంగారకాది పంచగ్రహాలు స్వోచ్చస్థానాలలో ఉండగా సుమిత్ర లక్ష్మణశత్రుఘ్నులను కవలను ప్రసవించింది
అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ
వీరౌ సర్వాస్త్ర కుశలౌ విష్ణో రర్ద సమన్వితా
పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః సార్పే జాతా తు సౌమిత్రీ కుళీరేఽభ్యుదితే రవౌ|
ఆ సమయంలో గంధర్వులు అవ్యక్త మధురంగా గానం చేసారు. అప్సరసలు ఆనందంతో నృత్యం చేసారు దేవ దుందుభులు మ్రోగాయి. ఆకాశంనుంచి పుష్పవృష్టి కురిసింది.
అయోధ్యలో ప్రజలందరికీ మహోత్సవం అయ్యింది. పండుగ చేసుకున్నారు.
వీథులన్నీ నటనర్తక గాయక గాయనీమణులతో నిండిపోయాయి.
గాన వాద్య ఘోషలతో పెద్ద కోలాహలం చెలరేగింది...
( సశేషము )..
No comments:
Post a Comment