Adsense

Friday, June 6, 2025

వాల్మీకి రామాయణం -23

రామ లక్ష్మణ విశ్వామిత్రులు గంగా నది దాటి దక్షిణ తీరానికి చేరారు....

రామచంద్రుడు దట్టమైన అడవి గురించి ప్రస్తావించాడు....విశ్వామిత్రుడు సమాధానం గా....

ఒకప్పుడు ఇక్కడ మలద అనీ కరూశమనీ రెండు జనపదాలు ఉండేవి. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో కూడా చెబుతాను.

వృత్రాసురుణ్ని సంహరించినందువల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొంది. ఆ మలంతోపాటు తీరని దాహం కూడా కలిగింది

అప్పుడు తపోధనులైన మహర్షులు కలశాలతో మంగళోదకాలను తెచ్చి ఇక్కడ దేవేంద్రునికి స్నానం చేయించారు మలమూ దాహమూ (కరూశము) వదిలించారు.

సంతుష్టుడైన శచీపతి ఆ జనపదాలకు మలదము కరూశము అని నామకరణం చేసాడు. ఇవి ధనధాన్య సమృద్ధితో చాలాకాలం విరాజిల్లాయి.

కొంతకాలానికి వెయ్యి ఏనుగుల బలం కలిగి కామరూప సంచారిణి అయిన ఒక యక్షిణి వచ్చింది. తాటక దానిపేరు.

రామా! భద్రమగుగాక. అది సుందుని భార్య. ఇంద్రపరాక్రముడైన మారీచుడు దాని కుమారుడు.ఇద్దరూ కలిసి మలద కరూశ జనపదాలను పూర్తిగా నాశనం చేసారు.

ఇదే దారిని ఆక్రమించుకొని సుమారు ఒక క్రోసెడు దూరంలో తాటక నివసిస్తోంది. ఈ దారినే వెళ్ళాలి మనం.

ఈ తాటకికి బ్రహ్మ వల్ల వర బలం ఆగస్త్యుని వలన శాపబలం రెండూ ఉన్నాయి.

స్త్రీ వధ కదా మహాపాతకం అని శంకించకు. సర్వజీవకోటికీ హితం కోరిన రాకుమారునికి ఇది కర్తవ్యం.

ప్రజారక్షణకోసం క్రూరమూ పాతకమూ దుష్టమూ అయిన పనులనుకూడా
రాజు చెయ్యవలసి ఉంటుంది. తప్పులేదు. రాజధర్మం. అటువంటిది.

అపుడు రాముడు విశ్వామిత్రునకు నమస్కరిస్తూ...
మహార్షీ ! అయోధ్యలో గురువుల సాక్షిగా మా తండ్రి నన్ను నీకు అప్పగించినపుడు “విశ్వామిత్రుని మాట జవ దాటవద్దు" అని ఆజ్ఞాపించాడు.

ప్రస్తుతం తాటకను సంహరించమని నీ శాసనం. చాలు. తాటకను సంహరిస్తాను సందేహం లేదు.

గో బ్రాహ్మణహితం కోరి దేశసౌఖ్యం కోరి అప్రమేయ ప్రభావుడవైన నీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను. తాటకను సంహరిస్తున్నాను.

ఆ యక్షిణి కామరూపధారణ శక్తితో అనేక రూపాలు ధరిస్తూ అంతలోనే అంతర్ధానం అవుతూ, శిలావర్షం ఎడతెరిపి లేకుండా కురిపిస్తూ,

భయంకరంగా అరుస్తూ, రామలక్ష్మణులను దారుణంగా చీకాకు పరిచింది.ఇద్దరూ రాళ్ళవానలో మునిగిపోతున్నారు.

గాధినందనుడు విశ్వామిత్రుడు గమనించాడు. రామా! ఇంక చాలయ్యా నీ దయ. ఇది పాపిని. యజ్ఞ విఘ్నకారిణి. మాయతో ఇలా ఇంకా పెరిగిపోతుంది సాయంకాలం కాబోతోంది.

సంధ్యా సమయంలో రాక్షసుల మాయలు మరీ విజృంభిస్తాయి. అందుకని వెంటనే సంహరించు.....

వెంటనే రాఘవుడు శబ్ద వేధిని సంధించి విడిచిపెట్టాడు. అది శిలావర్షాన్ని ఛిన్నభిన్నంచేస్తూ వెళ్ళి అదృశ్యరూపంలో ఉన్న తాటకకు తగిలింది.

అది రూపం ధరించి భూనభోంతరాళాలు మారు మ్రోగేటట్టు అరుస్తూ రాఘవులను తరుముకుంటూ వచ్చింది. పిడుగులా వచ్చి పడుతున్న తాటకను తీక్షంగా చూసాడు రాముడు.

దృఢ బాణం సంధించి గుండెలలో కొట్టాడు. అది కుప్పకూలిపోయింది. విలవిల లాడిపోయింది. బీభత్సంగా రోదిస్తూ గిలగిలా తన్నుకుని తన్నుకుని చచ్చిపోయింది.

ఆకాశంలో దేవేంద్రుడూ దేవతలూ సాధునాదాలు చేసారు. విశ్వామిత్రా ! నీకు జయమగుగాక ! మేమంతా ఆనందపరవశులమవుతున్నాం.

రాఘవులపట్ల స్నేహం ఇలాగే కొనసాగించు.  నీ దివ్యాస్త్రాలను రాఘవునికి ఉపదేశించు. నీకు శుశ్రూష చేస్తున్నాడు.

పైగా ఇతనితో దేవతలకు చాలా పెద్ద అవసరం (పని) ఉంది. ఇలా పలికి ఇంద్రాదులు వెళ్లిపోయారు.....

విశ్వామిత్రుడు అభినందన పూర్వకంగా రాముణ్ని అక్కున జేర్చుకున్నాడు. శిరస్సు మూర్కొన్నాడు. రామా!  ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం.

రేపు నా ఆశ్రమానికి వెళదాం అన్నాడు. ముగ్గురూ ఆ రాత్రి ఆ తాటకావనంలోనే సుఖంగా విశ్రమించారు. శాప విముక్తమైన ఆ వనం చైత్రరథంలా ప్రకాశించింది......

ఋతవస్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే | మంగళాని మహాబాహో! దిశంతు తవ సర్వదా |

(గొప్ప బాహువులు కల ఓ రామా...! ఋతువులు, సముద్రములు, ద్వీపములు,  వేదములు, లోకములు, దిక్కులును మంగళద్రవ్యములకు గూడ శ్రేష్ఠతను చేకూర్చునవై నీకు మంగళ మొసంగుగాక!)...

( స‌శేష‌ము )

No comments: