Adsense

Wednesday, June 11, 2025

వాల్మీకి రామాయణం - 31

సముద్రమధనం లో దైత్యులందరిని సంహరించిన దేవేంద్రుడు దేవ రాజ్యానికి తిరుగు లేని అధిపతి అయ్యాడు..

దితికి భరింపరాని పుత్రశోకం ఏర్పడింది. భర్తయైన కాశ్యపుని దగ్గరకు వెళ్ళి - నాథా! నీ పుత్రులు నా పుత్రులను సంహరించారు.

నేను అపుత్రనయ్యాను. ఈ దుఃఖం భరించలేను. శక్రుని సంహరించగల పుత్రుడు - శక్రహంత నాకు కావాలి.
ఎంతైనా తపస్సు చేస్తాను. అనుగ్రహించు - అని ప్రాధేయపడింది.

దితీ ! నీ దుఃఖం అర్ధం చేసుకోగలను. నీకు శుభమగుగాక ! వెయ్యి సంవత్సరాలు తపస్సు చెయ్యి.

గడువు పూర్తయ్యే నాటికి నీవు శుచిగా ఉంటే నీ కోరిక తీరుతుంది - అంటూ కాశ్యపుడు చేతితో దితిని మెల్లగా నిమిరి - స్వస్తి అని తపస్సుకు వెళ్ళిపోయాడు.

దితి కూడా కుశప్లవంచేరి దారుణ తపస్సుకు పూనుకొంది.
దితి గర్భవతి అయింది. సహస్రాక్షునికీ సంగతి తెలిసింది.

కుశప్తవానికి వచ్చి దితికి పరిచర్యలు చేస్తూ అమాయకురాలైన ఆమెను సేవలతో సంతోషింపజేశాడు.

వేయి సంవత్సరాలు పూర్తిగా వచ్చాయి. పది సంవత్సరాలే మిగిలాయి

ఆయాసము అధికమై దితి ఒకనాడు అనుకోకుండా శయ్యానాసములో తలక్రిందులుగా శయనించింది.

సహస్రలోచనునికి ఆ దృశ్యము కనబడింది. సమయము చిక్కింది. శరీర లోకి సూక్ష్మ రూపంలో ప్రవేశించి, వజ్రి తన వజ్రాయుధముతో ఆమె గర్భమును తరుగసాగాడు.

లోపలి పిండము రోదింపసాగింది. "మారుదః" "మారుదః" "ఏడువ వద్దు, ఏడువ వద్దు'అని ఇంద్రుడు దితిభీతితో పలుక సాగాడు.

లోపలి శిశువు రోదనము దితికి హఠాత్తుగా మెలుకువను కలిగించింది. "చంపవద్దు", "చంపవద్దు అని దితి వారించింది శతక్రతువు శిశు సంహారాన్ని ఆపాడు.

అప్పటికే దితి గర్భము లోని పిండము ఏడు ముక్కలయింది. దితి తలక్రిందులుగా అశుచిగా పడుకోవడమే పిండచ్చేదానికి కారణమని పురువూతుడు వినీతుడై ఆమెకు విజ్ఞాపనం చేశాడు

ఇంద్రుని కాపట్యమును దితి గ్రహించింది. అయితే తాను తప్పుజేసింది. కనుక ఇంద్రుని ఏమనరాదు. తెలివిగా తన పిండములను రక్షించు కోవాలను కుంది.

తన గర్భములోని సప్త భాగములు "మారుదః" అనే ఇంద్ర వచనాన్ని బట్టి సప్త మరుత్తులై -అతనికి మిత్రులై సకలలోకాలలో సంచరిస్తారని తెలిపింది. శతక్రతువు అందుకు సమ్మతించాడు."

రామభద్రా! దితి తపస్సు చేసిన ఆ కుశప్లవ వనస్థలమిదే అని విశ్వామిత్రుడు వివరించాడు. ఇదే స్థలములో ఇక్ష్వాకునుకు "అలంబుస"అనే అతివయందు "విశాలుకు" ఆనే పుత్రుడు జన్మించాడు

ఆయన పేరుతోనే ఈ "విశాల పురము" వెలిసింది. విశాలుని వంశములోని వాడైన సుమతి ప్రస్తుత భూపతి అని తెలిపి విశ్వామిత్రుడు విరమించాడు...

( స‌శేష‌ము )

No comments: