మిథిలా నగర సమీపాన జనశూన్యమైన ఆశ్రమం కనిపంచడం తో విశ్వామిత్రుడు ఆ ఆశ్రమం గురించి చెప్ప సాగాడు....
ఇది మహాత్ముడగు గౌతముని ఆశ్రమము. ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉండినది. దీనిని దేవతలు సైతము పూజించెడివారు.
ఇచ్చట గౌతముడు తన భార్యయగు అహల్యతో కూడినవాడై అనేక సంవత్సరములు తపస్సు చేసినాడు.
ఇంద్రుడు గౌతముని తపస్సును భగ్నము చేయబూని గౌతముడు ఆశ్రమమున లేని సమయము కనిపెట్టి మునివేషధారియై అహల్యను సమీపించి "నీతో క్రీడింపగోరుచున్నాను. నన్ను అనుగ్రహింపుము” అన్నాడు.
మునివేషమున వచ్చినవాడు ఇంద్రుడని తెలిసికొనియు అతని మీద ఆమెకు మనసు మరలినందున అహల్య సమ్మతించినది.
అహల్య : ప్రభూ! కృతార్థురాలనైతిని. నీవు త్వరగా వెడలిపొమ్ము. నిన్నును నన్నును రక్షించుకొను
మార్గమును చూడుము.
నా మర్యాదను కాపాడుము.
గౌతముడు వచ్చునేమో యని శంకించి ఇంద్రుడు వేగముగా వెడలుచుండినాడు. కాని గౌతముడు స్నానము చేసి ఆశ్రమమునకు వచ్చుచుండినాడు. ఇంద్రుడు గౌతముని చూచి భయపడి వివర్ణుడైనాడు
[చేయగూడని పని చేసినచో ఇంద్రుడైన నేమి మరెవ్వడైన నేమి! ఇదే గతి! ]
గౌతముడుకూడ ఇంద్రునిచూచి కోపించి శపించినాడు.
దుర్మార్గుడా! నీవు విఫలుడ వగుదువుగాక” అని శపించినాడు. ఇంద్రుడు వెంటనే విఫలుడైనాడు (వృషణాలు కోల్పోవడం)
గౌతముడు అహల్యను సైతము శపించినాడు. “నీవు ఈ ఆశ్రమమునందే అనేక వేల సంవత్సరములు వాయు భక్షణము మాత్రము చేయుచు బూడిదలో శయనించి తపస్సు చేయుచు
ఏ ప్రాణికిగాని కనబడక యుందువు గాక .”
మునివర్జితమై భయంకరముగానుండు ఈ ఆశ్రమమునకు దశరథపుత్రుడగు శ్రీరాముడు ఏనాడు వచ్చునో ఆనాడు నీవు శుచివి కాగలవు.
శ్రీరామునికి అతిథి సత్కారము చేసి దాని వలన లోభ మోహములను వీడి నీవు నీ నిజరూపమును దాల్చి నా ఎదుట సంతోషమున నుండగలవు అని చెప్పినాడు.
ఇంద్రుడు తన తప్పును దేవతలవద్ద మొరపెట్టుకొనగా వారు మేష వృషణాలతో అతన్ని సఫలుడ్ని చేసినారు.
రామా..!ఇప్పుడు గౌతముని ఆశ్రమమునందు ప్రవేశించి అహల్యకు శాపవిముక్తి కలిగించు.
శ్రీరాముడు అడుగు పెట్టుట తోడనే తపస్సుచే ఇనుమడించిన కాంతితో తేజరిల్లుచుండిన అహల్య కానవచ్చినది.
శాపము అంతమైనందున వారికి కనబడినది రామలక్ష్మణులు అహల్య పాదములకు నమస్కరించినారు. శాపకాలమున గౌతముడు పలికిన మాటలను స్మరించి
అహల్య రామలక్ష్మణులకు అతిథి సత్కారము చేసి పూజించినది.
ఈ శుభసమయమున పుష్పవృష్టి కురిసినది. అప్సరసలు ఆడినారు. గంధర్వులు పాడినారు.
గౌతమ మహామునీశ్వరులు సైతము అచ్చటికి వచ్చినారు. చిరకాలము విడివడియుండిన అహల్యా గౌతములు కలుసుకొన్నారు. గౌతముడు కూడ శ్రీరాముని యథావిధిగా పూజించినాడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట బెట్టుకొని మిథిలకు ప్రయాణమైనాడు.
.,......సశేషం.......
Note అహల్య శిలాగా మారడం,దేవేంద్రుడు కోడిగా రావడం ఇవన్నీ కల్పితాలు.వాల్మీకం కావు.
No comments:
Post a Comment