తమిళనాడులో శివమహాదేవునికి, ఆయన అర్థాంగి పార్వతీ దేవికి, పెద్ద కుమారుడు గణేశుడికి, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యునికి ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దేవతల కుటుంబాలకు లేదు అనడం అత్యంత సహజం. ముఖ్యంగా కుమారస్వామి విషయానికి వస్తే, చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల, ముగ్ధమోహన స్వామికి గొప్ప చరిత్ర కలదు.
సుబ్రహ్మణ్యునికి అనేక పేర్లు ఉన్నాయి: కుమార, కుమరన్, స్కంద, షణ్ముఖ, శరవణ, గుహ, మురుగన్ అనేలా పేర్లతో ఆయన్ను పిలుస్తారు. తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించిన ముఖ్య ఆలయాల్లో 'పళని' అనేది అత్యంత ప్రముఖమైనది.
ఈ పుణ్యక్షేత్రానికి ఓ ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. శివుడు ఒకసారి తన ఇద్దరు కుమారులైన గణేశుడు, కుమారస్వాములను పిలిచి — "యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణం చేస్తే, వారికి ఓ అద్భుత ఫలాన్ని ఇస్తాను" అని అన్నారు.
వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై విశ్వాన్ని చుట్టేందుకు బయలుదేరాడు. కానీ గణేశుడు కొద్దిసేపు ఆలోచించి, తల్లి తండ్రుల చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేసి, ఆ ఫలాన్ని పొందాడు. ఈ విషయం తెలిసిన కుమారస్వామి అలిగాడు. దాన్ని చూసిన శివుడు — "నీవే ఓ ఫలం - నీవే 'పళని'. నీ పేరుతో ఓ పుణ్యక్షేత్రాన్ని ఏర్పరిస్తాను. అది నీ స్వంత స్థలం అవుతుంది. అక్కడ నివసించు" అని అనుగ్రహించాడు. అలా వైభవంగా పళని ఆవిర్భవించింది.
పళనిలోని మురుగన్ ఆలయం ప్రకృతి సౌందర్యంతో నిండి, కనులపండువుగా కొండపై వెలసి ఉంది. దీనిని ‘మురుగన్ కొండ’ అని కూడా పిలుస్తారు. ఆలయ దర్శనానికి 659 మెట్లు ఎక్కాలి. శక్తిలేని వారి కోసం ఏరియల్ రోప్‌వే కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా గిరిప్రదక్షిణ చేసి, ఆపై కొండ ఎక్కడం సంప్రదాయం.
కొండపై చేరిన తరువాత కనిపించే ప్రకృతి దృశ్యాలు హృదయాన్ని ఆనందింపజేస్తాయి. మొదట రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం దాటి ముందుకు వెళ్తే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఇది శిల్పకళలో అద్భుతంగా ఉంటుంది. తదుపరి నవరంగ మండపం, అందమైన ద్వారపాలక విగ్రహాలు దర్శనమిస్తాయి.
గర్భగృహంలో ప్రతిష్ఠితమైన కుమారస్వామి విగ్రహాన్ని 18 సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్యవేక్షణలో తయారుచేశారని, ఇది అపురూపమైన 'నవపాషాణ' విగ్రహమని చెబుతారు. ఇందులో శక్తివంతమైన మూలికలు సమ్మేళనంగా ఉండేలా తయారు చేశారని విశ్వసిస్తున్నారు.
ఈ విగ్రహ విశిష్టత ఏమిటంటే — పూజా సమయాల్లో వెలువడే ఉష్ణానికి, మూలికా పదార్థాలు శక్తివంతమైన వాయువులను ఉద్గరిస్తాయని, ఆ వాయువులను పీల్చినవారికి కొన్ని వ్యాధుల దోషాలు తొలగిపోతాయని, ఆరోగ్యంగా మారతారని అంటారు.
ఈ మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి, భక్తులకు వరాలను ప్రసాదించే, కోరిన అభీష్టాలను తీర్చే కొండంత దేవుడిగా భాసిస్తారు. ప్రతి నెల కృత్తికా నక్షత్రానికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆషాఢ కృత్తిక నాడు విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment