Adsense

Wednesday, December 3, 2025

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 19 అధ్యాయం

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 19 ,వ భాగం... ప్రారంభం....!!🌹🙏

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌹
పానీయాలు:  🌹

🌸ఆహార పానీయాల విషయంలో శ్రద్ధ తీసుకుని , నిషిద్ధమైనవి స్వీకరించకుండా వుండటంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ! అప్పుడే మనస్సు ఆరోగ్యంగా ఉండి మండల దీక్ష పూర్తిచేయడానికి వీలు కలుగుతుంది !
  అనారోగ్యకారణమైన మత్తు పదార్థాలతో కూడిన పానీయాలు త్రాగకూడదు ! సురాపానం చేయరాదు!

🌿ఆరోగ్యాన్ని కలిగించే పాలు , మజ్జిగ తేట , పండ్ల రసాలు త్రాగవచ్చును ! సరైన ఆహారంవలన దేహానికి శక్తి లభిస్తుంది ! మనస్సు ప్రశాంతంగా వుంటుంది ! నిద్ర సరిగా పడుతుంది ! దీక్షాకాలంలో సాత్వికాహారం స్వీకరించాలి !

🌸అటుకులు , కాయగూరలు , అన్నం మధ్యాహ్నం వేళ స్వీకరించి , ఉదయం , రాత్రి కాలంలో పాలు , పండ్లు స్వీకరించాలి !

🌹
ఇతర దీక్షా నియమాలు :🌹

🌿దీక్ష స్వీకరించిన మొదట రోజూ మూడుసార్లు చన్నీటితో తలస్నానం ఆచరించాలి ! నుదుట విభూది , చందనం , కుంకుమధారణచేసి నల్లని వస్త్రాలు ధరించాలి !
ఉదయ , సాయంకాల సమయాలలో దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేయాలి !

🌹
కర్మేంద్రియాలు: 🌹

🌸మాట్లాడే నాలుక, పనులు చేసే చేతులు, నడిపించే కాళ్లు,  మూత్ర విసర్జన మరియు మలమూత్రలు అనబడే ఐదు కర్మేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని వాటి చేత మంచి పనులు చేయించడం దీక్షా నియమాల ముఖ్యోద్దేశం !
నాలుక మాట్లాడటానికి సహకరించే కర్మేంద్రియం ! అట్లాగే రుచిని తెలిపే జ్ఞానేంద్రియం కూడా !
దీక్షాకాలంలో నాలుకను అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం!

🌿 అందువల్ల మాటల చేత , తినడం చేత జరిగే తప్పులను , పొరబాట్లను అరికట్టడం జరుగుతుంది ! 
కోపాన్ని విడిచి , శాంతంగా వుండాలి !
వాక్కుకు సంబంధించి దీక్షాకాలంలో మితంగా \, మృదువుగా మాట్లాడటం అలవర్చుకోవాలి ! సత్యం మాట్లాడాలి ! సౌమ్యంగా , ఇతరులను సంతోషపెట్టేలా మాట్లాడాలి !

🌸అనవసరపు మాటలు , అబద్ధాలు చెప్పడం , ఇతరులను నొప్పించేలా మాట్లాడటం , వివాదాలు , తగవులుపడటం , ఇతరులను దూషించడం దీక్షాకాలంలో చేయకూడదు !

🌿భగవద్భక్తిని కలిగించే పుస్తకాలు , నీతి బోధకాలైన పుస్తకాలు చదవాలి !  
చేతులు మంచి కార్యాలు - దానధర్మాలు  చేయడానికి , స్వామి పూజకు ఉపయోగపడాలి ! జీవహింస, దొంగతనాలు , ఇతరులను కొట్టడం వంటి పనులు దీక్షాకాలంలో చేయరాదు !

🌸పాదములు - దేవాలయాలను , పుణ్యక్షేత్రాలను దర్శించడానికి కాలినడకన (శక్తినిబట్టి) వెళ్లడం మంచిది ! 
జూదగృహాలు , వేశ్యాగృహాలకు వెళ్లకూడదు !  
దీక్షాకాలంలో బ్రహ్మచర్యాన్ని  విధిగా పాటించాలి ! 

🌿వేశ్యలతో సంపర్కం , బలాత్కరించడం మొదలైన విషయాల గూర్చి ఆలోచించకూడదు ! కోరికలను అదుపులో ఉంచుకుని ఆస్ఖలిత బ్రహ్మచర్యాన్ని ( స్త్రీ సంబంధిత ఆలోచనలతో వీర్యస్ఞలనమవడం) పాటించడానికి ప్రయత్నిచాలి ! 
మనస్సు విషయవాంఛలవైపు పరిగెత్తకుండా ఉండటానికోసమే సాత్వికాహారం తీసుకోవాలన్న నియమం ఏర్పడింది !

🌹
దమము: 🌹

🌸ఆహార నియమాలు సక్రమంగా పాటించడంవల్ల విరేచనాలు మలబద్ధకం వంటిరోగాలకు గురికాకుండా శరీరారోగ్యాన్ని కాపాడుకోవచ్చును !
కర్మేంద్రియాలను నిగ్రహించడాన్ని దమము అంటారు.

🌿జ్ఞానేంద్రియాలైన ముక్కు , చెవులు , కళ్లు , నాలుక , చర్మము వీటిని నియత్రించడాన్ని ‘శమము’ అంటారు .
జ్ఞానేంద్రియాల విషయంగా దీక్షాకాలంలో పాటించవలసిన నియమాలు.

🌹
చెవులు: 🌹

🌸శబ్దాన్ని గ్రహించే జ్ఞానేంద్రియాలు చెవులు ! దీక్షాకాలంలో చెవులను బ్రద్దలు చేసే పెద్ద పెద్ద శబ్దాలను , ఇంద్రియాలను ఉద్రేకపరిచే సంభాషణలను వినగూడదు ! మనస్సుకు శాంతిని ప్రసాదించే దైవ సంబంధిత పాటలను , పురాణాలను వినాలి ! శాస్ర్తీయ సంగీతాన్ని వినడంవల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది ;

🌹
కళ్లు: 🌹

🌿ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరిశీలనాగుణాన్ని అలవరచుకోవాలి ! విషాదకరమైన , భయానకమైన , శృంగారపరమైన దృశ్యాలనుర చూడకూడదు ! ఎటుచూసినా కళ్లకు స్వామి అయ్యప్ప గోచరించే స్థితికి మనస్సు , కళ్లు చేరుకోవడానికి దీక్షాకాలంలో సాధన చేయాలి !

🌹
నాలుక: 🌹

🌸రుచిని తెలియజేసే జ్ఞానేంద్రియం నాలుక ! దీక్షాకాలంలో అన్ని రకాల రుచులు కోరుకునే నాలుకను నియంత్రించి సాత్వికాహారాన్ని మాత్రమే భుజించాలి ! తీపి , ఉప్పు , పులుపు , కారం , మసాలా దినుసులు లేని ఆహారం తినాలి ! అటుకులు , పాలు , పండ్లు స్వీకరించాలి !

🌹
ముక్కు: 🌹

🌿వాసనను గ్రహించే జ్ఞానేంద్రియం ముక్కు ! దుర్వాసనలు వచ్చే అశున్ర వాతావరణంలో వుండకూడదు మనస్సుకు హాయిని , శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పూలతోటలలో తిరగడం , పూజకు పూలు సేకరించడం చేయాలి !

🌹
చర్మము: 🌹

🌸శరీరం అంతర్భాగాలను కప్పివుంచి , స్పర్శజ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానేంద్రియ చర్మం ! సౌందర్యం చర్మంవల్లనే కలుగుతుంది శరీరానికి ! 
చల్లని నీటితో రోజూ మూడుసార్లు స్నానం చేయడంవల్ల చర్మం పరిశుభ్రమైన హాయిని ప్రసాదిస్తుంది ! చర్మానికి హాని కలిగించే తైలాలు, లేపనాలు వాడకూడదు ! 
నలుగుపిండితో చర్మాన్ని శుభ్రపరచుకోవాలి ! 


🌿అందంగా కనబడటాని ప్రాధాన్యతనివ్వకూడదు ! 
దీక్షాకాలంలో ముఖ క్షవరం , కేశఖండనం (జుత్తు కత్తిరించడం) గోళ్లు తీయడం చేయరాదు ! పాదరక్షలు వాడకూడదు !

🌸దీక్షాకాలంలో శవాలను చూడరాదు ! 
బహిష్టు స్త్రీలను చూడరాదు ! పొరపాటున చూస్తే తలస్నానం చేసి , కర్పూరం వెలిగించి , శరణు ఘోష చేయాలి !
వ్రత దీక్షాకాలంలో దీక్షలో వున్న ఇతరులను ‘స్వామి’ అని , చిన్నపిల్లలను ‘మణికంఠ’ అని , స్త్రీలను ‘భగవతి’ అని పిలవాలి ! 

🌿అయ్యప్ప స్వాములు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ముందు మూడుసార్లు ‘స్వామి శరణం’ అని చెప్పుకుని సంభాషణ పూర్తి అయిన తరువాత తిరిగి ‘స్వామి శరణం’ అని మూడుసార్లు చెప్పడం అలవర్చుకోవాలి !

🌸శ్రీ అయ్యప్ప పూజ ఎక్కడ జరుగుతున్నా , పిలవకపోయినా వెళ్లి భజన కార్యక్రమంలో పాల్గొనాలి ! దీక్షకాలంలో కనీసం ఐదు పూజా , భజన కార్యక్రమాలలో పాల్గొనాలి ! శబరిమల యాత్రకు వెళ్లేముందు కనీసం పదిమందికి అన్నసంతర్పణ కావించాలి ! అయ్యప్ప ఎవరుగానీ సద్ది , భిక్షలకు ఆహ్వానిస్తే నిరాకరించకూడదు. కుల , మత , తర తమ భేదాలు మరిచి అందూ కలిసి భుజించాలి !

🌿దీక్షలో వున్నపుడు మాంసము భుజించరాదు. తాంబూలం , ధూమపానం , క్షవరం , గోర్లు , కత్తిరించడం  చేయకూడదు. చెడుఅలవాటులకు దూరంగా ఉండవలెను. మండల దీక్షాకాలంలో చెప్పబడిన నియమాలను సక్రమంగా పాటించడం వల్ల పంచేంద్రియాల వల్ల కలిగే ప్రలోభాలకు
లొంగకుండా మనస్సును నిశ్చలంగా నియంత్రించడానికి తగిన సాధన లభిస్తుంది.

🌸అయ్యప్పస్వామి ఎక్కి వెళ్లిన పద్ధెనిమిది మెట్లను ఎక్కడానికి అర్హత ప్రసాదించడంలో పంచేంద్రియాల నియంత్రణ మొదటి ఐదు మెట్లను ఎక్కే సామర్థ్యతను కలిగిస్తాయి ! ఇంకా అష్టరాగాలనే 8 రాగాలు , త్రిగుణాలనే 3 గుణాలు , విద్య - అవిద్య అనే రెండు (మొత్తం 13) కూడ నియంత్రించబడితేనే మిగిలిన పదమూడు మెట్లు ఎక్కడానికి సమర్థత లభిస్తుంది !

🌹
అష్టరాగములు:🌹

🌿అహంకారమనే మాయ పొర ఎప్పుడూ మనస్సును ఆవరించే వుంటుంది ! 
అహంకారం నుండి మదం మొలకెత్తుతుంది !
నేను, నాది, నావల్లనే సర్వం జరుగుతున్నది, నన్ను మా ఇంచినది మరొకటి లేదు అనబడే భావాలన్నీ అహంకారం నుండి పుట్టి మదంతో కలిసి పతనానికి దారితీసేలా చేస్తాయి !
అహంకారం , మదంలను కలిపి అష్టరాగాలు లేక అష్టమదాలుగా వ్యవహరిస్తారు.  

🌸అవి - విద్యామదము, శీలమదము, రూప మదము, తపోమదము, కుల మదము, యవ్వనమదము, ధనమదము , రాజ్యమదము. దీక్షాకాలంలో ఈ ఎనిమిది మదాలు తలేత్తకుండా జాగ్రత్తపడాలి !

🌿 అహంకారానికి మూలమైన ఈ ఎనిమిది రాగాలవల్ల ప్రభావితం కాకుండా మనస్సును , భక్తి మార్గంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించాలి.

🌹
భక్తిమార్గము: 🌹

🌸సామాన్యులకు , దీక్షాధారులకు అందరికీ అనుసరించదగ్గ మార్గం భక్తిమార్గం ! 
భగవంతుడు వున్నాడనే నమ్మకం, విశ్వాసం దృఢంగా కలిగివుండి, ఆ భగవంతుడిని ఎవరికి ఇష్టమైన రూపంలో వారు ఆరాధించడం భక్తిమార్గంగా తెలుపబడింది !
ఈ మార్గంలో మండలకాలంలో దీక్షాధారులు రోజూ మూడు పూటలు అయ్యప్పస్వామిని పూజించి , భజనలు చేసి అందరిలో ఆ స్వామిని దర్శిస్తూ , సదా అయ్యప్ప నామస్మరణ చేస్తూ గడపడంవల్ల వాళ్ళకు సత్త్వ , రజో తమోగుణాలనే మూడు గుణాలను నియంత్రించే సామర్థ్యం లభిస్తుంది !

🌹
త్రిగుణాలు
తమోగుణము: 
🌹

🌿అజ్ఞానం , అలసత్వం , విపరీతమైన నిద్ర , కపటం , గర్వం , దురభిమానం , క్రోధం, కోపం , పౌరుషం ఈ గుణం లక్షణాలు ! దీక్షాకాలంలో వీటన్నిటినీ నియంత్రించి మనస్సు వాటివల్ల ప్రభావితం కాకుండా చూసుకోవాలి.

🌹
రజోగుణము: 🌹

🌸రాగద్వేషాలను కలిగిస్తుంది ! కోరికలను రేకెత్తిస్తుంది ! దంభము , దురభిమానము , రాజసం , గర్వాహంకారాలు ఈ గుణంవల్ల ప్రకోపిస్తాయి. వీటిని దీక్షాకాలంలో అణచివేసి ప్రశాంతంగా వుండటం అలవరచుకోవాలి !

🌹
సత్త్వగుణము: 🌹

🌿సత్యము , శౌచము , క్షమాగుణం , అనుకంప , శాంతి , సంతోషం మొదలైనవి సత్త్వగుణ లక్షణాలు ! వీటిని అలవరచుకుని దీక్షాకాలంలో మసలుకోవడం ప్రధానం ! మంచి గుణాలు అలవరచుకుని , చెడు గుణాలకు దూరంగా ఉంటూ భగవధ్యానంలో గడపాలి !

🌹
అవిద్య - విద్య🌹

🌸అవిద్య అంటే అజ్ఞానం! మంచి విషయాలను తెలుసుకోవాలన్న కోరిక లేకపోవడం అవిద్యకు కారణం! అవిద్యవల్ల వివేచనా, తెలివితేటలు, బుద్ధి వికాసం లేకుండా నిస్సారమైన జీవితం గడపవలసి వుంటుంది !

🌿విద్య నేర్పే గురువుల సహాయంతో అవిద్యను తొలగించవచ్చును ! మూఢుడైన శిష్యుడికి విద్యాబోధన చేసి మంచి విషయాలు తెలుసుకోవాలన్న కోరిక కలిగేలా చేస్తాడు గురువు ! అంతవరకు అతడు పశుప్రాయమైన జీవితం గడుపుతూ వచ్చిన  విషయం శిష్యునికి తెలిసేలా చేస్తాడు !

🌸అవిద్య ప్రభావం నుండి బయటపడి విద్య నేర్చుకోవడానికి ఆసక్తి కలగడంతో గురువుగారి నాశ్రయించి విద్యనభ్యసిస్తాడు శిష్యుడు ! కొన్ని శాస్త్రాలలో నిపుణడౌతాడు !
భగవంతుని గూర్చిన విషయాలు పౌరాణిక గ్రంథాలను చదివి , గురువుగారి ఉపదేశాలు విని కొంతవరకు తెలుసుకోవడం జరుగుతుంది !
🌿విద్యావంతులు వేదాధ్యయనం చేసి భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ! వారికంతా తెలిసిపోయినట్లనిపిస్తుంది మొదట్లో ! అంతటితో భగవంతుని తత్వాన్ని గ్రహించి జ్ఞానులైపోయారన్న మిథ్యాజ్ఞానం కలుగుతుంది ! ఆ భావన నిజం కాదు ! అందుకే దాన్ని మిథ్యాజ్ఞానం అన్నారు.

🌸ఈ మిథ్యాజ్ఞానం వల్ల అహంకారం మొలకెత్తుతుంది !
దీక్షాకాలంలో ఈ మిథ్యాజ్ఞానంవల్ల వచ్చే అహంకారాన్ని (విద్యామదం) అణచివేయాలి ! అందుకు భక్తిమార్గం సహకరిస్తుంది !
అవిద్యను వదలి విద్యావంతుడైన భక్తుడు స్వామి సేవలో గడిపి ధన్యుడౌతాడు.

🌿శౌనకాది మునులారా ! అయ్యప్పస్వామి ఎక్కివెళ్లిన పద్ధెనిమిది మెట్లను ఎక్కి వెళ్లి ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి గురువు ద్వారా తీసుకోవలసిన దీక్ష , మాలధారణ , దినచర్య పాటించవలసిన నియమాల గూర్చి మీకు తెలియజెప్పాను ! ఆ నియమాలన్నీ పాటించడమంటే తపస్సుతో సమానమని గ్రహించండి !

🌸 విషయ వాంఛలనుండి ఇంద్రియాలను నిగ్రహించి , సత్కర్మలే ఆచరిస్తూ , సమతాభావంతో అయ్యప్ప ధ్యానంలో గడిపే మండల దీక్షాకాలం కఠోర తపస్సుతో సమానమైనది ! ముఖ్యంగా కలియుగంలో కలి ప్రభావానికి గురికాకుండా వుండటానికి , మానవులను సన్మార్గంలో నడిపించడానికి అయ్యప్పస్వామి ఈ విధమైన నియమాలను ఏర్పరచటం జరిగింది.

🌿ఆ స్వామి మీద చెక్కు చెదరని విశ్వాసంతో మండల దీక్ష స్వీకరించాలన్న సంకల్పం కలిగిన భక్తులను స్వామే స్వయంగా నియామకాలను పాటించే శక్తి సామర్థ్యాను ప్రసాదిస్తాడు.

🌸నిజమైన భక్తి విశ్వాసాలు లేకుండా కేవలం ఆడంబరానికి దీక్ష స్వీకరించి నియమాలను సరిగా పాటించనివారు యాత్ర చేయలేరు ! ఏదోవిధమైన ఆటంకం ఏర్పడి మండల దీక్ష అసంపూర్తిగా ఆగిపోతుంది ! అందుకే భక్తివిశ్వాసాలతో , త్రికరణశుద్ధిగా (మనసా , వాచా , కర్మలచేత) నియమాలను పాటించి శబరిమల యాత్రకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ధన్యులవుతారు. మండల దీక్ష స్వీకరించిన స్వాములు ! అంటూ చెప్పటం ఆపారు సూతమహర్షి !

🌿‘‘మహర్షి ! మీ నోట తపస్సుతో సమానమైన అయ్యప్పస్వామి మండల దీక్ష , నియమాల గూర్చి విని ధన్యులమైనాము దీక్షా కాలం ముగిసాక చేయవలసిన శబరిగిరి యాత్ర గురించి కూడా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అడిగారు మునిబృందాలు !

🌸‘‘తప్పకుండా తెలియజెబుతాను ! ముందుగా ఒక్కసారి ఆ శబరిగిరీశుని మనస్సులో నిలిపి భక్తిపూర్వకంగా ధ్యానించండి !
‘‘ఓంకారమూలం జ్యోతి స్వరూపం
పంబానదీ తీర శ్రీ భూతనాథం
శ్రీదేవదేవం చతుర్వేదపాలం
శ్రీ ధర్మశాస్తారం మనసా స్మరామి 
వందే మహేశ హరిమోహిని భాగ్యపుత్రం 
వందే మహోజ్జ్వల కరం కమనీయ నేత్రం 
వందే మహేంద్ర వరదం జగదేక మిత్రం. 
వందే మహోత్సవ నటనం మణికంఠ సూత్రం" అంటూ కన్నులరమోడ్చి ధ్యానించి చెప్పసాగాడు సూతమహర్షి !

🌹
శబరిగిరి (శబరిమల) యాత్ర వివరాలు యాత్ర అంతరార్థం:🌹

🌿జీవాత్మ ఒక దేహాన్ని వదిలి పైలోకాలకు ప్రయాణించే అంతిమ యాత్రను మహాప్రస్థానం అంటారు ! ఆ ప్రయాణంలో బంధువులెవరూ వెంట వెళ్లలేరు ! ఆ జన్మలో చేసిన పుణ్యపాప కర్మలు మాత్రమే వెంట వెళుతాయి ! తాను సంపాదించినవేవీ వెంట వెళ్లలేవు ! తాను చేసిన పుణ్యపాప ఫలితాలమీద తర్వాత వచ్చే జన్మ ఆధారపడి వుంటుంది !

🌸 జీవించి వుండగానే పవిత్రమైన (నియమాలవల్ల) జీవాత్మ , పరబ్రహ్మమైన అయ్యప్పస్వామిని దర్శించుకుని , పునర్జన్మ లేకుండా ఆ స్వామిలో లయం కావాలన్న కోరిక విన్నవించుకోవడానికి చేసే ప్రయాణమే శబరిగిరి యాత్ర ! స్వామి అనుగ్రహంతో జీవించి వున్నంతవరకు సత్కర్మలు , పుణ్యకార్యాలు ఆచరిస్తూ ముక్తిని పొందాలన్న అంతరార్థం కలిగివుంది శబరిగిరియాత్ర !

🌿యాత్రకు తరలివెళ్ళే విధానం
మండల కాల దీక్ష పూర్తయిన మరునాడు దీక్ష స్వీకరించిన స్వాములకు ఇండ్లలో వాళ్లు (కుటుంబ సభ్యులు) భిక్ష వేసి హారతి ఇచ్చి , దిష్టికాయ కొట్టి యాత్ర సఫలంగా జరగాలని శుభాకాంక్షలు చెబుతారు !

🌸 ఇక తిరిగి వెనుదిరగకుండా గురుస్వామి దగ్గరకు చేరుకుంటారు దీక్షాధారులు ! గురుస్వామి వారి చేత ముందుగా ఇరుముడి కట్టించుతారు !
మాలధారణలాగే ఇరుముడి కట్టే కార్యక్రమం కూడా చాలా ముఖ్యమైనది !

🌹
ఇరుముడి ప్రాముఖ్యత🌹

🌿మణికంఠుడు తల్లికోసం పులిపాలు తేవడానికి అరణ్యానికి బయలుదేరినపుడు తండ్రి రాజశేఖరుడు ఒక వస్త్రంలో రెండు అరలుగా చేసి ఒక దాంట్లో మణికంఠునికి రక్షగా ఈశ్వరుని ధ్యానిస్తూ కొబ్బరికాయ , పూజాద్రవ్యాలు ఒక అరలోనూ , రెండవ దానిలో ప్రయాణపుదారిలో తినడానికి ఆహార పదార్థాలు పెట్టి , మూటగా కట్టి తీసుకువెళ్లమని కుమారునికి ఇస్తాడు !

🌸 తండ్రి మాటను కాదనకుండా ఆ మూటను తలమీద పెట్టుకుని వెళతాడు మణికంఠుడు ! ఆ మూటే ‘ఇరుముడి’ గా పిలువబడుతుంది ! (రెండు అరలు కలిపి ముడి వేసిన సంచి) మణికంఠుడు ఇరుముడిని తలమీద ధరించి వెళ్లినట్లే మండల దీక్ష ముగించి స్వాములు కూడా అదేవిధంగా నింపిన సంచులను తలమీద పెట్టుకుని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లడం శుభప్రదంగా భావింపబడుతున్నది
!..సశేషం... 🙏

🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో  తెలుసుకుందాం...🌞

No comments: