Adsense

Wednesday, December 3, 2025

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 22వ అధ్యాయం

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 22,వ భాగం ప్రారంభం...!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌸కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి ! జయవర్థనుడు , శశికళల పుత్రుడు జన్మించి దిన దిన ప్రవర్థమానుడౌతున్నాడు ! తనకు అయ్యప్పస్వామి చెప్పినట్లుగా ఆ బాలుడిని స్వామి అంశగా భావించి ‘అయ్యప్ప’ అనే నామకరణం చేసాడు కుమారుడికి జయవర్థనుడు !

🌿అయ్యప్ప రూపురేఖలు , అతని మృదుస్వభావం , అందరిపట్ల కనబరిచే కరుణ - ఆ ప్రాంతం వారిని అతనినొక అసాధారణ బాలుడిగా గుర్తించేట్లు చేసాయి ! వన్యమృగాలు అతనికి నేస్తాలు ! భయపడకుండా వాటితో ఆటలాడేవాడు !

🌸ఎవరికే కష్టం వచ్చినా అయ్యప్ప అనుగ్రహంతో తీరిపోయేవి ! దుర్భిక్షం , అనారోగ్యం ఆ ప్రాంతంలో కాలుపెట్టకుండా శాసించిన పన్నెండేళ్ల బాలుడు అయ్యప్పను ఆ ప్రాంతం వాళ్ళు ధర్మశాస్తా అపరావతారంగా కొలవడం మొదలుపెట్టారు !

🌿‘‘అయ్యప్ప వేద శాస్త్రాలలో , యుద్ధ విద్యలలో నిపుణయ్యాడు ! ఇక ఆ ఉదయనుడిని నిర్జించడానికి తరలివెళ్లవలసిన సమయం ఆసన్నమైంది !’’ అనే నిర్ణయానికి వచ్చిన జయవర్థనుడు మామగారికి లేఖ రాసి పుత్రుడికి ఇచ్చాడు !

🌸 ‘‘నాయనా ! ఈ లేఖ తీసుకుని వెళ్లి పంబల రాజ్య రాజుగారిని కలుసుకో ! నీ తాతగారైన ఆయనను ఉదయనుడనే బందిపోటు దొంగ చెరసాలలో బంధించి హింసిస్తున్నాడనీ , పంబల రాజ్యంలో తన ప్రతినిధులను వుంచి అరాచకం ప్రబలేలా చేస్తున్నాడని విన్నాను !

🌿నీవు వెళ్లి ఆయనను రక్షించి , ఆ రాజ్యాన్ని ఆ దుర్మార్గుడి హస్తాలనుండి బయటపడేలా చూడు ! మా అందరి ఆశలు నీమీదే పెట్టుకున్నాము! వెళ్లు ! విజయాన్ని సాధించు !’’ అని కర్తవ్యోపదేశం చేశాడు  అయ్యప్ప తల్లిదండ్రులకు నమస్కరించి , వాళ్ల దీవెనలు తీసుకుని లేఖతో పంబల రాజ్యానికి పయనమైనాడు.

🌸రెండు రోజులు ప్రయాణం చేసి అయ్యప్ప పందల రాజ్యం చేరి రాజభవనాన్ని సమీపించేసరికి అర్థరాత్రి అయింది ! భటులందరూ గాడనిద్రలో ఉన్నారు ! వాళ్లను దాటి చెరసాల చేరుకున్నాడు అయ్యప్ప ! అతనికి స్వాగతం పలుకుతున్నట్లు చెరసాల ద్వారాలు వాటంతటవే తెరచుకోవడంతో లోపలకు ప్రవేశించాడు !

🌿 ‘‘తాతా !’’ అని పిలిచాడు మెల్లగా. ఒక మూలగా కూర్చుని భగవంతుని ధ్యానిస్తున్న రాజు రాజశేఖరుడు ఆ పిలుపుకి ఉలిక్కిపడి కనులు తెరిచాడు ! ఎదురుగా నిలిచి చిరునవ్వుతో చూస్తున్న ఆజానుబాహువు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘నీవు.. నీవు..’’ అంటూ ఏం మాట్లాడాలో తెలియనట్లు చూస్తుంటే ‘‘మీ మనవడిని ! నా పేరు అయ్యప్ప ! జయవర్థనుడు , శశికళల కుమారుడిని !’’ అంటూ పరిచయం చేసుకుని తండ్రి ఇచ్చిన లేఖను అందించాడు చదవంటూ !

🌸 మసక వెలుతురులోనే లేఖను చదివి పట్టలేని ఆనందంతో మనవడిని కౌగిలించుకున్నాడు రాజశేఖరుడు ! ‘‘అలనాడు శ్రీకృష్ణుడు తాతను చెర విడిపించినట్లు ఈనాడు నన్ను చెరవిడిపించడానికి వచ్చిన దేవుడివి , మా అయ్యప్పస్వామివి ! నీ కోసమే ఎదురుచూస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న నన్ను , ఈ రాజ్య ప్రజలను కాపాడాల్సిన భారం నీదే నాయనా !’’ అన్నాడు వణుకుతున్న కంఠంతో !

🌿 ‘‘నేను వచ్చింది అందుకోసమే గదా తాతగారూ ! ఇక నిశ్చితంగా ఉండండి’’ అంటూ తన వెంట తాతను బయటకు తీసుకువచ్చాడు అయ్యప్ప.

🌸తెల్లవారింది ! ఉదయనుడి ప్రతినిధులందరూ సభా మండపానికి వచ్చి సింహాసనం మీద ఆసీనుడై వున్న అపరిచితుడిని చూసి ఆశ్చర్యపోయారు ! ‘ఎవరితను ? ఎక్కడినుండి వచ్చాడు ? మన అనుజ్ఞ లేకుండా సింహాసనాన్ని అధిష్ఠించాడే ! ఎంత ధైర్యం ? ఎవరో తెలుసుకోవాలి ముందర !’ ఆవేశంగా తమలో తామే అనుకుంటూ ముందుకు దూసుకువచ్చిన వాళ్లలో అనుకోని మార్పు వచ్చింది. అయ్యప్ప వాళ్లవైపు నిశితంగా చూసిన చూపుకు అందరూ ఆయుధాలు క్రింద పడేసి ‘స్వాగతం నాయకా ! మీకు సుస్వాగతం’ అంటూ నమస్కరించారు. 

🌿 ‘‘మీరందరూ ఇకపై పందల రాజు రాజసింహుడి సేవకులు ! వారి మనవడిని వారికి ప్రతినిధిని అయిన నా ఆజ్ఞలను పాలించవలసి వుంటుంది మీరందరూ !’’ గంభీరంగా అన్నాడు అయ్యప్ప వాళ్లవైపు తీక్షణంగా చూస్తూ ! మౌనంగా తలలూపి నిలిచారందరూ !

🌸 ‘‘ఎవరు మీలో సేనాధిపతి ?’’ అధికార పూర్వకంగా అడగటంతో ‘‘నేను నాయకా ! నా పేరు రణతుంగుడు !’’ వినయపూర్వకంగా జవాబు చెప్పి ముందుకు వచ్చి నిలిచాడు ఒకడు ! 
 ‘‘రణతుంగా ! వెంటనే సైన్యాలను ఒక చోట సమావేశపరుచు ! నేను ఇక్కడి సేనల పరిస్థితి తెలుసుకోవాలనుకుంటున్నాను ముందుగా !’’ అనేసరికి ‘‘క్షమించండి నాయకా ! ప్రస్తుతం వున్న సేన నామమాత్రమే ! అందరూ తమ బాధ్యతలు మరిచి భోగ విలాసాలలో కాలం గడుపుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు !

🌿 ప్రజలు కూడా అంతే ! యువకులెవరూ సైన్యంలో చేరలేదు ! ప్రజలందరిలో క్రమశిక్షణ లేకుండా పోయింది !’’ అంటూ బెరకుగా అక్కడి పరిస్థితులు వివరించాడు ఉదయనుడు నియమించిన సేనాధిపతి రణతుంగుడు ! ‘‘ఊ.. ‘యథారాజా తథాప్రజ’ అన్నట్లు మీరు మీ బాధ్యతలు విస్మరించి ప్రజలలో అరాచకం ప్రబలేలా చేశారన్నమాట ! ముందుగా ఇక్కడి పరిస్థితులు చక్కదిద్దాలి !’’ అంటూ పంబలరాజ్య సేనను , ప్రజలను , ఉదయనుడి ప్రతినిధులను సరిదిద్దడానికి పూనుకున్నాడు అయ్యప్ప!
🌸అయ్యప్ప పర్యవేక్షణలో క్రమంగా అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి ! సైనికులలో తిరిగి క్రమశిక్షణ నెలకొన్నది ! అంతవరకు ఉదయనుడి ప్రతినిధులకు భయపడుతూ వాళ్లకు సేవలు చేస్తూ బ్రతుకుతున్న ప్రజలలో అయ్యప్ప రాకతో ధైర్యం , ఉత్సాహం చోటుచేసుకున్నాయి ! ‘‘మనం ఎదురుచూస్తున్న మన దైవం అయ్యప్ప తిరిగి అవతరించి మన మధ్యకు వచ్చాడు ! ఇక ఉదయ నుడి అంతం దగ్గర పడినట్లే’’ అని సంతోషపడుతూ అయ్యప్పకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఆయన నేతృత్వంలో అందరూ మంచి పౌరులుగా మసలుకోసాగారు !

🌿 దృఢకాయులైన యువకులను సైన్యంలో చేర్చుకుని తగిన శిక్షణ ఇప్పించి సైన్యాన్ని బలవత్తరం కావించాడు ! అయ్యప్ప రాకతో రాజ్యంలో దుర్భిక్షం అరాచకం స్థానే సుఖ శాంతులు నెలకొన్నాయి. ప్రజలందరిలో అయ్యప్ప పాలనలో ఉదయనుడి ప్రతినిధులు కూడా మనస్సులు మారి అయ్యప్ప సేవలో క్రమశిక్షణ పాటిస్తూ మసలుకోసాగారు!

🌸పందల రాజ్యంలో పరిస్థితులు సరిదిద్దుతున్న అయ్యప్ప మరొక ప్రమాదకరమైన సముద్రపు దొంగను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ దొంగ పేరు వావరు ! మంత్ర తంత్రాల్లో ఆరితేరినవాడు ! నాయకా ! సముద్ర దొంగ వావర్ ఉదయనుడికన్నా బలవంతుడు ! మంత్ర తంత్రాలు తెలిసినవాడు ! కాలభైరవోపాసకుడు ! సముద్రం మీద ప్రయాణించే వర్తకుల ఓడలను అడ్డగించి వాటిని కొల్లగొడుతూండే వావరు దృష్టి ఇప్పుడు తీర ప్రాంత రాజ్యాలమీద పడిందట !

🌿తన సేనతో తీర ప్రాంతాలపై దాడులు చేస్తున్నాడు ! ఇటువైపునకు ఏ సమయంలోనైనా దండెత్తి రావచ్చును ! అతడిని ఎదిరించడం మన సేనలవల్ల కాకపోవచ్చు ! అంటూ రణతుంగుడు తెచ్చిన ఆ వార్త విని చిన్నగా నవ్వాడు అయ్యప్ప !  ‘‘మనసేనంతా ఎందుకు ? నీవు , నేను చాలమా ?’’ అడిగాడు హాస్య ధోరణిలో ! రణతుంగుడు ఆందోళనగా చూశాడు ! ‘నాయకా ! వావరు శక్తి సామర్థ్యాల గూర్చి తెలిసి వున్నవాడిని గనుక మీకు చెప్పే సాహసం చేస్తున్నందుకు మన్నించండి. తన మంత్ర బలంతో ఎదుటి పక్షంవారిని పక్షులుగా , జంతువులుగా మార్చేసి వాటితో వినోదిస్తుంటాడు !

🌸 కొందరి తలలు నరికి తాను ఉపాసించే కాలభైరవుడికి బలిగా సమర్పిస్తాడు ! రక్తం నివేదన చేసి ఆ రక్తాన్ని పాత్రలనిండా తాను త్రాగేసేంతటి కఠినాత్ముడు ! ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాయకా !’’ అంటూ రణతుంగుడు చేసిన హెచ్చరిక ఏమార్పూ తేలేదు అయ్యప్పలో ! ‘‘కాలభైరవుడంటే కాశీ పట్టణాన్ని కాపాడుతుండేవాడు , ఏకాదశ రుద్రులలో ఒకడు ! ఆ స్వామి భక్తుడిని చూడాలన్న కోరిక నాలో మరింత దృఢమైంది గానీ , భయంతో వెనుకంజ వేయాలనిపించడంలేదు ! రేపే మనం బయలుదేరుతున్నాం’’ అంటూ సభను చాలించి లేచాడు అయ్యప్ప !

🌿ప్రతిరోజూలాగే నిలువెత్తు కాలభైరవుని విగ్రహానికి పూజాదికాలు నిర్వర్తిస్తున్నాడు సముద్ర దొంగ వావరు ! ఇతరులను చంపి వారి ధనపురాశులను దోచుకోవడం వృత్తి అయిన వావరు కాలభైరవుని ఉపాసన మాత్రం భక్తితో నిష్ఠగా జరుపుతాడు ! పూజ చేస్తున్నంతసేపు ఇతరపు ఆలోచనలు మనస్సులో ప్రవేశించవు ! తాంత్రిక పూజ కావిస్తాడు ! పూజానంతరం తన మామూలు కార్యక్రమాలలో ప్రవేశిస్తాడు !

🌸 ఆ రోజు పంబల రాజ్య తీరం వైపు వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకుని అందుకు సిద్ధవౌతున్నాడు వావర్! 
  అంతలో.. ‘‘వత్సా ! ఈవేళ నీవు వెళ్లవలసిన అవసరం లేకుండా నీ దగ్గరకే ఒక వ్యక్తి రాబోతున్నాడు ! అతని రాకతో నీ జీవన విధానమే మారిపోతుంది ! వేచి వుండు !’’ అన్న అశరీరవాణి పలుకులు వినరావడంతో ఆశ్చర్యంగా ఆలోచనామగ్నుడైనాడు వావరు ! ‘‘ఆ పలుకులు తను ఉపాసించే కాలభైరవునివే ! ఎవరి విషయంగా తనను సావధాన పరుస్తున్నాడు ? ఎవరా వస్తున్న వ్యక్తి ? అనుకుంటుండగానే భటుడొకడు పరుగు పరుగునవచ్చాడు !

🌿 ‘‘నాయకా ! మన స్థావరం వైపు ఎవరో గజారూఢుడైన వ్యక్తి వస్తున్నాడు ! అతనిని ఆపడం మనవాళ్ళ సాధ్యం కాలేదుట !’’ అంటూ భటుడు తెచ్చిన వర్తమానం విని కనుబొమ్మలు ముడివడగా ‘‘ఎవరింతటి సాహసం చేసి మన స్థావరంలోకి ప్రవేశించారు ? వెంటనే నా రథాన్ని సిద్ధం చేయండి’’ అంటూ లేచి బయటకు వచ్చాడు వావరు ! రథం కొద్ది దూరం వెళ్లగానే మందగమనంతో సాగివస్తున్న తెల్లని ఏనుగు మీద ఆసీనుడై వస్తున్న అయ్యప్ప దర్శనమిచ్చాడు ! ఆవైపే చూస్తూ వుండిపోయాడు వావరు తనను తానే మరిచి ! ‘ఆహా ! ఎంతటి దివ్య మంగళరూపం ! కరుణ ఆ కళ్ళలోనుండి జాలువారుతున్నది ! చిరునవ్వుతో తనవైపే చూస్తున్న ఆ కళ్లు నన్ను గుర్తించలేదా ? అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి !

🌸సందేహం లేదు !
కాలభైరవస్వామి తనను సావధానపరిచింది ఈ దివ్య మంగళ మూర్తి గురించే ! చూస్తుంటే అతనికి నా సర్వస్వాన్ని అర్పించివేయాలనిపిస్తున్నది !   దొంగతనాలు , దోపిడీలు ఏవీ వద్దు ! వెళ్లి ఆ దివ్య పురుషుని పాదాలనాశ్రయిస్తాను ! అనుకుంటూ రథం దిగి ఎదురువెళ్లాడు ముకుళిత హస్తాలతో ! ‘‘ నామీద దయతో నా గృహానికి వచ్చిన దివ్య పురుషా ! నీకు నా సాదర ప్రణామాలు ! నీ దర్శనంతో...
సశేషం.. 🙏

🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో  తెలుసుకుందాం...🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸🌿

No comments: