Adsense

Wednesday, December 3, 2025

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 23 అధ్యాయం

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 23 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿నేను ధన్యుడినైనాను ! నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నాను ! స్వీకరించి నన్ను నీ వాడిని చేసుకో ’’ అంటూ తదేకంగా స్వామి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు ! ‘‘యుద్ధంలో నిపుణుడివని విన్నాను ! నాతో తలపడకుండా శరణు కోరుతున్నావే ! నేనెవరినో గుర్తెరిగావా ?’’ చిరునవ్వుతో అడిగాడు అయ్యప్ప ఏనుగుమీద నుండి దిగుతూ !

🌸 ‘‘పంబల రాజకుమారుడిగా మనవడిగా నిన్ను గుర్తించాను ! ఆ రాజ్యాన్ని ఉదయనుడి పాలననుండి విడుదల చేసి సైన్యాలను సమీకరించి అతనిపై యుద్ధం ప్రకటించబోతున్నావని విన్నాను ! అందుకే ముందుగా నీ రాజ్యంవైపే రావాలని నిశ్చయించుకున్నాను గానీ నీవే నన్ను కలుసుకోవడానికి రావడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది ! నీవు సామాన్యుడవు కావని , కారణజన్ముడివని గ్రహించాను !

🌿ఓ దివ్య ప్రభావ సంపన్నుడా ! నీతో యుద్ధాన్ని కాదు మిత్రత్వాన్ని వాంఛిస్తున్నాను’’ అన్నాడు వావరు భక్తిపూరితమైన హృదయంతో ! సాదరంగా అతని చేయందుకుని భుజంమీద తట్టాడు అయ్యప్ప !  ‘‘అలాగా ! ఇకపై నీవు నా మంచి మిత్రునిగా నాతోనే ఉండవచ్చును ! నీవు పంబల సైన్యానికి సర్వసేనాధిపతిగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అంటూ ఆ బాధ్యత అప్పగించాడు అయ్యప్ప !

🌸 ‘‘అలనాడు మహిషిని సంహరించడానికి అవతరించిన అయ్యప్ప నేడు కలి ప్రభావంతో విజృంభించిన దుష్టులను అంతం కావించడానికి తిరిగి మన మధ్యకు రావడం మన భాగ్య విశేషం ! అయ్యప్పకు , వారి మిత్రులకు పాండ్యరాజ్యం సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది !’’

🌿మిత్రులతో సభాప్రవేశం చేసిన అయ్యప్పకు పుష్పమాల వేసి సాదరంగా ఉచితాసనంమీద ఆసీనుడిని కావించి అతిథి సత్కారాలు జరిపాడు పాండ్యరాజు వీరపాండ్యుడు ! వావరును మిత్రునిగా చేసుకున్న అయ్యప్ప కొచ్చుకడత్త , కరప్ప , విల్లన్ , మల్లన్ అనే బలశాలులైన మరి నలుగురు దుండగులను తన ప్రభావంతో మంచివారిగా మార్చి తనమిత్రులుగా చేసుకున్నాడు ! వారు కూడా అయ్యప్ప సైన్యంలో చేరి సైనికులకు తగిన శిక్షణ ఇచ్చే బాధ్యత స్వీకరించారు.

🌸 ఉదయనుడు తప్ప సముద్రపు దొంగ వావరు , ఇతరులు అయ్యప్పకు మిత్రులవడం పంబల రాజ్యానికి పొరుగునవున్న పాండ్యరాజు వీరపాండ్యుడు విని తాను కూడా అయ్యప్పతో స్నేహ బాంధవ్యాలు పెట్టుకోవాలని ఆశించాడు ! అతని ఆశయం నెరవేర్చడానికన్నట్లుగా మిత్రులు వెంటరాగా పాండ్యరాజ్యానికి వచ్చాడు అయ్యప్ప ! తన కోరిక నెరవేడంతో ఆనందోత్సాహాలు చోటుచేసుకున్నాయి పాండ్య రాజులో ! అందుకే అయ్యప్పకు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటుకావించాడు ! 

🌿‘‘పాండ్యరాజా ! మీ ఆదరానికి , అభిమానానికి కృతజ్ఞులం ! ప్రస్తుతం నేను ఉదయనుడిని ఎదుర్కొనడానికి వెళ్లనున్నాను ! మీరు మీ సేనాసమేతంగా మా వెంట రావచ్చును !’’ అని చెప్పాడు అయ్యప్ప ! ‘తప్పకుండా ! మా కోరికా అదే ! ఇంతకుక్రితం అతని చేతిలో అపజయం చవి చూసినా ఇప్పుడు మీవెంట వచ్చి మా శాయశక్తులా పోరాడి అతడిని ఓడించాలని కోరుకుంటున్నాము !

మాకూ అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞులం !’’ ఉత్సాహంగా సేనతో అయ్యప్ప వెంట బయలుదేరాడు వీరపాండ్యుడు ! దండయాత్ర ప్రారంభమైంది ! జయభేరి మ్రోగించి ఉదయనుని స్థావరాన్ని చుట్టుముట్టాయి అయ్యప్ప సేనలు , పాండ్య సేనలు ! ‘‘నాకు స్నేహితులు కావలసిన సముద్ర దొంగ వావరు , మరికొందరు ఆ అయ్యప్పకు మిత్రులైపోయి నామీదే దండెత్తి వస్తున్నారా ? వాళ్లందరినీ నా కత్తికి బలి యిస్తాను !

ఈ ఉదయనుడి శక్తి ఏమిటో తెలిసేలా చేస్తాను !’’ అని కోపంతో పళ్లు పటపటలాడిస్తూ తన సేనలతో వాళ్ళను ఎదుర్కొన్నాడు ఉదయనుడు!
   ‘‘పిరికిపందలారా ! నన్ను శరణనకుండా ఆ రాకుమారుడి వెనుక నిలబడ్డారా ? ఇప్పుడే నా కత్తికి బలి ఇస్తాను , చూడండి’’తన కళ్లకు సామాన్య రాకుమారుడిలాగా కనిపిస్తున్న అయ్యప్ప వైపు తేలికగా చూస్తూ అతని వైపు దూసుకువెళ్లాడు !

🌸‘‘నీ ముచ్చట తీరుస్తాను ! రా కత్తితో కాదుగా నీ ద్వంద్వ యుద్ధానికి వస్తావా ?’’ అని కవ్విస్తూ ఏ ఆయుధం లేకుండా ఉదయనుడిని ఎదుర్కొన్నాడు అయ్యప్ప ! ఇద్దరిమధ్యా కొంతసేపు తీవ్రంగా జరిగింది ద్వంద్వ యుద్ధం ! అందరూ ఆందోళనగా చూడసాగారు ! ‘‘నాయకా ! వాడిని కరుణించవద్దు !’’ అంటూ హెచ్చరించారు మిత్రులందరూ ! వాళ్ళ వైపు చిరునవ్వుతో చూసి ‘‘మీరందరూ చెబుతున్నారు గనక ఈ లీలా వినోదాన్ని ఇక చాలిస్తాను !’’ అంటూ ఉదయనుడిని అమాంతంగా ఎత్తి పట్టుకుని గిరగిర త్రిప్పి పైకి విసిరేశాడు !

రక్తం కక్కుతూ పెద్ద శబ్దంతో క్రిందపడ్డ అతని శరీరంమీద నిలిచి తాండవం చేసాడు ! ఆ దృశ్యాన్ని చూస్తుంటే అక్కడ నిలిచి చూస్తున్న వాళ్లందరికీ అయ్యప్పలో మహిషి మర్దవం కావిస్తున్న మణికంఠుడు దర్శనమిచ్చాడు !

🌿అందరూ భక్తి పారవశ్యంతో పరవశించిపోతూ ‘‘అయ్యప్ప స్వామికి జయము ! హరిహరపుత్రుడు , ధర్మశాస్తా , మణికంఠునికి జయము ! జయము !’’ అంటూ జయజయధ్వానాలు కావించారు !ఉదయనుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజాకంటకుడైన ఆ దుండగుడు మరణించడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది ! చల్లని గాలులు వీస్తూ హాయిని కలిగించాయి హృదయాలకు !

🌸 ఉదయనుడి మరణంతో బాధా భయాలు తొలగిపోయి తేలిక పడిన హృదయాలతో అందరూ అయ్యప్ప చుట్టూ చేరి స్తుతించారు.

🌹‘‘
పాహి పాహి అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
భక్తజనప్రియ అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
కలియుగ వరదా అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
పరమ కృపాళో అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
🌹

🌿అందరి వైపు ప్రసన్నంగా చూస్తూ అక్కడనుండి పంబానదివైపు దారితీశాడు అయ్యప్ప !
పంబానదీ - విడిది, అయ్యప్ప పంబానది తీరాన్ని చేరి పరివారంతో అక్కడ విడిది చేశాడు ! ఆ ఒడ్డునే డేరాలు వేసి అయ్యప్ప కూర్చోవడానికి ఆసనం వేశారు ! పంబానది వాళ్ళను చూసి సంతోషంతో పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! ‘‘గంగతో సమానమైన ఈ నది ఒడ్డున పితరులకు పిండ ప్రదానాలు చేయడం , తర్పణాలు విడవడంవల్ల ఏడు తరాలవారికి సద్గతులు లభిస్తాయి !

🌸 మీరందరూ కూడా మరణించిన మీ పెద్దలనుద్దేశించి ఈ నదీ జలాలలో తర్పణాలు అర్పించండి !’’ అని అయ్యప్ప చెప్పడంతో పరివారంలోని వారందరూ భక్తిపూర్వకంగా తర్పణాలు అర్పించారు ! అయ్యప్ప చెప్పడంతో యుద్ధంలో మరణించిన యోధులకు తర్పణాలు విడిచారు !
అయ్యప్ప అక్కడినుండి పంబల రాజుకు , తన తల్లిదండ్రులకు వెంటనే తన విడిదికి రావలసిందిగా దూతలతో వర్తమానం పంపించాడు ! వార్త అందిన వెంటనే వారు ఆనందోత్సాహాలతో బయలుదేరి పంబానదీ తీరాన్ని చేరుకున్నారు ! 

🌿   ‘‘కుమారా ! అయ్యప్ప ! నిన్ను కన్న మేము ధన్యులమైనాము !పంబలరాజ్యం , పాండ్య వంశం ధన్యమైనాయి. కన్నుల కరువు తీరా నిన్ను చూసే భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించావా తండ్రీ ! అంతకంటే మాకింకేం కావాలి ? నీకు సదా కృతజ్ఞులమై ఉంటాము’’ చేతులు జోడించి అంటున్న వాళ్లను వారించాడు అయ్యప్ప ! ‘‘మీరు పెద్దలు , నాకు వందనీయులు ! నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు ! నేను వచ్చిన కార్యం పూర్తయింది ! ఇక నేను నా నివాసానికి బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది !

🌸 శబరిగిరి మీద నా నివాసానికి ప్రయాణం సాగించనున్న నా వెంట మీరు కూడా అంతవరకు రావచ్చును’’ అంటూ చెప్పాడు అయ్యప్ప అందరినీ ఉద్దేశించి ! ఆ మాటలు అందరిలో ఆనందోత్సాహాలు కలిగించాయి ! 
  ‘‘అయ్యప్పస్వామీ ! మీ వెంట మేమూ గిరిమీదకు వచ్చేందుకు అవకాశం ప్రసాదించావు ! ఎంతటి కరుణామయుడివి తండ్రీ !’’ అంటూ పరివారంలోని వారందరూ , పంబలరాజు , పాండ్యరాజు , జయవర్థనుడు , ఆయన భార్య అయ్యప్ప వెంట నడుస్తుండగా తాము వెనకగా అనుసరించారు !పంబా నదిని దాటి శబరిగిరి వైపు దారితీశాడు అయ్యప్ప !

🌹
మందిర పునర్నిర్మాణం | అయ్యప్ప ఆలయ ప్రవేశం..🌹

🌿‘‘సైనికులారా ! మీ ఆయుధాలను ఈ అశ్వత్థవృక్షం దగ్గర వుంచి , అందరూ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి ముందుకు పదండి ! అదుగో ! ఆ కనిపిస్తున్న ఆలయమే మణికంఠుని కోసం విశ్వకర్మ , పరశురాములవారు నిర్మించినది’’ కొంతదూరంలో కనిపిస్తున్న ఆలయంవైపు చూపిస్తూ చెప్పాడు అయ్యప్ప ! ‘‘అలాగే స్వామి’’ అంటూ అందరూ ఆయుధాలు , అశ్వత్థ (రావిచెట్టు) వృక్షం దగ్గర భద్రపరిచి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని శరణుఘోష గొంతెత్తి పాడుతూ ముందుకు సాగారు ! అయ్యప్ప ముందు నడవగా అందరూ ఆలయాన్ని సమీపించారు !

🌸 ఉదయనుడి దాడులవల్ల ఆలయం కొంత దెబ్బతిన్నది ! పూజారులు అయ్యప్ప విగ్రహానికి పూజార్చనలు జరుపుతున్నా భక్తుల రాకపోకలు ఆగిపోయాయి ! ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద నీరవం తాండవమాడుతూ ఉన్నది అక్కడ కొంతకాలంగా ! అయ్యప్ప పరివార సమేతంగా అక్కడకు చేరడంతో పరిసరాలలో చైతన్యం వచ్చింది ! ఎండిపోయిన చెట్లు చిగురించి ప్రకృతి కళకళలాడింది ! అయ్యప్పకు స్వాగతం చెబుతున్నట్లు జల జలమంటూ పుష్పవృష్టి కురిసింది స్వామిమీద !

🌿అయ్యప్ప చుట్టూరా ఒకసారి నిశితంగా పరిశీలించాడు ! ఆయన దృష్టి ఆలయం మీద కేంద్రీకృతమైంది ! అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా ఆలయం పునర్నిర్మింపబడి పూర్వపు శోభతో కలకలలాడింది ! పరశురాములవారు ప్రతిష్ఠించిన విగ్రహం యధాతథంగా దర్శనమిచ్చింది ! ఆయన నియమించిన పూజారుల వంశస్థులు పరుగు పరుగున వచ్చి అయ్యప్పకు స్వాగతం పలికారు !

🌸పద్ధెనిమిది మెట్లను , చిన్ముద్రా , అభయముద్రలు చూపుతూ పట్టుబంధంలో పీఠంమీద ఆసీనమై వున్న స్వామి విగ్రహాన్ని చూస్తూ అందరూ భక్తి పారవశ్యంతో మైమరచిపోయారు !

🌿‘‘స్వామియే శరణం అయ్యప్పా !’’ అంటూ ముక్తకంఠంతో స్తుతించారు ! ‘‘అయ్యప్పా ! నీ దయవల్ల ఈ రోజు మేమందరం ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని , ఇందులో వెలసి వున్న మణికంఠుని దర్శించగలిగాము ! నీకు మా కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకోగలం ? తండ్రీ ! మా నమస్కారాలను స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి !’’ అంటూ తమ వైపు చిరునవ్వుతో చూస్తూ నిలిచిన అయ్యప్పకు నమస్కరిస్తూ అన్నారందరూ ! ‘

🌸‘నిర్మల హృదయంతో చేసిన నమస్కారం చాలు నాకు ! మీ యోగక్షేమాలు సర్వదా గమనిస్తూనే వుంటాను ! మీరందరూ దీక్షాధారులై నా సన్నిధికి రావచ్చును పద్ధెనిమిది మెట్లను ఎక్కి ! మీకు సన్మార్గాన్ని చూపడానికి , కలి పురుషునీ , శనీశ్వరునీ ప్రభావానికి లోనుకాకుండా పుణ్యకార్యాలు ఆచరించి ఆత్మ సంయమనం పొందడానికి మండలదీక్ష ఎంతోగానో సహాయపడుతుంది , గుర్తుంచుకోండి ’’ అని చెప్పాడు మేఘ గంభీర స్వరంతో
!...సశేషం.. 🙏

No comments: