క్షీరాబ్ధి ద్వాదశి వ్రత విధానం
*శ్రీ పసుపు గణపతి పూజ*
శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)
శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధనం
శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)
శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి(అక్షతలు వేయవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి
(గంధం చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి
(అగరవత్తుల ధుపం చూపించవలెను.)
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(బెల్లం ముక్కను నివేదన చేయాలి)
ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
(నీరు వదలాలి.)
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.
(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.
శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.
(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)
ప్రాణప్రతిష్ఠపన
అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా// తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే // అధ ధ్యానం.
క్షీరాబ్ధి పూజ విధానము
ధ్యానం:
(పుష్పము చేతపట్టుకొని)
శ్లో. దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః కరే
చక్రమూర్ధ్వకరే వామం, గదా తస్యా న్యధః కరే
దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం
క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
(పుష్పము వేయవలెను).
ఆవాహనం:
ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్,
స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ ద్దశాంగులమ్.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
(పుష్పము వేయవలెను).
ఆసనం:
శ్లో. అనేక హార సంయుక్తం నానామణి విరాజితం
రత్న సింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను.)
పాద్యం:
శ్లో . పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద
పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
అర్ఘ్యం:
శ్లో. నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక,
ఆర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ఆర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
ఆచమనం:
శ్లో. సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక
గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం .
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
పంచామృతస్నానం
శ్లో. స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం
పంచామృతైః స్నాపయిష్యేతంశుద్ధో దకేనాపిచ //
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // పంచామృతస్నానం సమర్పయామి.
టహ్దనంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
వస్త్రం:
శ్లో. విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం,
వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఉపవీతం:
శ్లో.నారాయణ నమస్తేస్తు నాకాధిపతిపూజిత,
స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధం:
శ్లో. రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే
కస్తూరీమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి.
(గంధం చల్లవలెను.)
అక్షితలు:
శ్లో. అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ,
గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // అక్షితాన్ సమర్పయామి.
(అక్షితలు సమర్పించవలెను)
పుష్పసమర్పణం:
చామంతికా వకుళచంపక పాటలాబ్జ పున్నాగ జాజికరవీరరసాల పుష్పై బిల్వ ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం
పూజయామి జగదీశ్వర, వాసుదేవః పుష్పాణి పూజయామి.
(పుష్పాములు వేయవలెను)
అథాంగపూజా:
శ్రీకృష్ణాంగపూజా పారిజాతాపహారకాయనమః పాదౌ పూజయామి,
గుణాధరాయ నమః గుల్ఫౌ పూజయామి,
జగన్నాథాయ నమః జంఘే పూజయామి,
జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి,
ఉత్తాలతాల భేత్రై నమః ఊరూ పూజయామి,
కమలానాథాయ నమః కటిమ్ పూజయామి,
నిరంజనాయ నమః నితంబర పూజయామి,
నారయణాయ నమః నాభిమ్ పూజయామి,
వామ్నాయ నమః వళిత్రయం పూజ,
కాలాత్మనేనమః గుహ్యం పూజయామి,
కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరమ్ పూజయామి,
హృషీకేశాయ నమః హృదయమ్ పూజయామి,
లక్ష్మీవక్షస్థలాయ నమః వక్షఃస్థలమ్ పూజయామి,
పార్థసారథయే నమః పార్శ్వే పూజయామి,
మధురానాథాయ నమః మధ్యమ్ పూజయామి,
హరయే నమః హస్తాన్ పూజయామి,
అనిరుద్ధాయనమః అంగుళీః పూజయామి,
శంఖచక్ర గదాశారఙ్గథారిణే నమః బాహూన్ పూజయామి,
వరదాయనమః స్తనౌ పూజయామి,
అధోక్షజాయ నమః అంసౌ పూజయామి,
కంబుకంఠాయ నమః కంఠం పూజయామి,
ఓజిస్వినే నమః ఓష్ఠౌ పూజయామి,
దామోదరాయ నమః దన్తాన్ పూజయామి,
పూర్ణేందునిభవక్త్రాయ నమః ముఖమ్ పూజయామి,
గరుడవాహనాయ నమః గండస్థలమ్ పూజయామి,
నరనారాయణాత్మకాయ నమః నాసికమ్ పూజయామి,
నీలోత్పలదళశ్యామాయ నమః నేత్రే పూజయామి,
భృగ్వాదిమునిసేవితాయై నమః భ్రువౌ పూజయామి,
భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమః భ్రూమధ్యమ్ పూజయామి,
కుండలినే నమః శ్రోత్రే పూజయామి,
లక్ష్మీపతయే నమః లలాటమ్ పూజయామి,
శిశుపాలశిరశ్చేత్త్రే నమః శిరః పూజయామి,
సత్యభామారతాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి
ధూపం:
శ్లో . దశాంగం గుగ్గులో పేతంచందనాగురువాసితం
ధూపం గృహాణ దేవేశ దూర్జటీనుతసద్గుణా
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
దీపం:
శ్లో// అజ్ఞాన ధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే
ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తితః
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి
నైవేద్యం:
పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ,
దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజిత
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)
ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,
(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం:
విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం
కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
ప్రదీపితంచ కర్పూర ఖండకైః జ్ఞానదాయినం
గృహాణేదంమయాదత్తం నీరాజనమిదం ప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి.
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)
నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
మంత్రపుష్పమ్:
పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత!
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.
( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )
ప్రదక్షిణ
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసార సాగరాన్మాం త్వ ముద్ధరస్య మహాప్రభో ప్రదక్షిణ.
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)
శ్లో//యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం.
సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం:
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం
తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు
శ్రీ కృష్ణార్పణమస్తు.
(శ్రీ తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం.)
క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ
పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో 'స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు దెలియని దర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని యడుగగా వ్యాసుడు 'నాయనా! మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పినాడు.క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూఁకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి, యొక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా - ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును. అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము, అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని యడుగగా వ్యాసిడిట్లు చెప్పదొండగెను. ' దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల మ్రుగ్గుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీ మాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను బూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని యనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను జెప్పుమని యడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. 'యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును ? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగాఁ జేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నూవులనూనె మధ్యమము. తేనె యదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానములవలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నియు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.' అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారుత్తమలోకమును బొందుదురు. తుదకు ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు.తులసి యున్న ఇంటిలో గాపురము చేయుట, తులసితోట వేసి పెంచుట, తులసిపేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు. తులసి యున్న చోటునకు యమకింకరులు రారు.
'యాన్ములే....' అను మంత్రమును బఠించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులను నిద్దఱు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక స్థలములో నొక తులసితోటను జూచిరి. చూచినతోడనే వారిలో సుమేధుడు భక్తితో బ్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక మఱ్ఱిచెట్టునండకుజేరి తులసికథ నిట్లు చెప్ప దొడఁగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానందబాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీఱ బలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను. అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామఱ్ఱి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. ' నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి గావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెఱచి యా మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనిగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని' అని జెప్పి , రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను. ' ఈయన పూర్వమొక మునికుమారుడిగానుండి గురుsకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సువగు మని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీదయ వలన బవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించినారు గాన మీతీర్థయాత్రాఫలము సిద్దించినది.' అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దఱు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను.' అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసికథ విన్నవారుత్తములగుదురు.