Adsense

Thursday, June 12, 2025

"పళని" గాలి పీల్చిన వారికి దోషాలు హరించుకుపోతాయట!

తమిళనాడులో శివమహాదేవునికి, ఆయన అర్థాంగి పార్వతీ దేవికి, పెద్ద కుమారుడు గణేశుడికి, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యునికి ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దేవతల కుటుంబాలకు లేదు అనడం అత్యంత సహజం. ముఖ్యంగా కుమారస్వామి విషయానికి వస్తే, చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల, ముగ్ధమోహన స్వామికి గొప్ప చరిత్ర కలదు.
సుబ్రహ్మణ్యునికి అనేక పేర్లు ఉన్నాయి: కుమార, కుమరన్, స్కంద, షణ్ముఖ, శరవణ, గుహ, మురుగన్ అనేలా పేర్లతో ఆయన్ను పిలుస్తారు. తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించిన ముఖ్య ఆలయాల్లో 'పళని' అనేది అత్యంత ప్రముఖమైనది.

ఈ పుణ్యక్షేత్రానికి ఓ ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. శివుడు ఒకసారి తన ఇద్దరు కుమారులైన గణేశుడు, కుమారస్వాములను పిలిచి — "యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణం చేస్తే, వారికి ఓ అద్భుత ఫలాన్ని ఇస్తాను" అని అన్నారు.

వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై విశ్వాన్ని చుట్టేందుకు బయలుదేరాడు. కానీ గణేశుడు కొద్దిసేపు ఆలోచించి, తల్లి తండ్రుల చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేసి, ఆ ఫలాన్ని పొందాడు. ఈ విషయం తెలిసిన కుమారస్వామి అలిగాడు. దాన్ని చూసిన శివుడు — "నీవే ఓ ఫలం - నీవే 'పళని'. నీ పేరుతో ఓ పుణ్యక్షేత్రాన్ని ఏర్పరిస్తాను. అది నీ స్వంత స్థలం అవుతుంది. అక్కడ నివసించు" అని అనుగ్రహించాడు. అలా వైభవంగా పళని ఆవిర్భవించింది.

పళనిలోని మురుగన్ ఆలయం ప్రకృతి సౌందర్యంతో నిండి, కనులపండువుగా కొండపై వెలసి ఉంది. దీనిని ‘మురుగన్ కొండ’ అని కూడా పిలుస్తారు. ఆలయ దర్శనానికి 659 మెట్లు ఎక్కాలి. శక్తిలేని వారి కోసం ఏరియల్ రోప్‌వే కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా గిరిప్రదక్షిణ చేసి, ఆపై కొండ ఎక్కడం సంప్రదాయం.

కొండపై చేరిన తరువాత కనిపించే ప్రకృతి దృశ్యాలు హృదయాన్ని ఆనందింపజేస్తాయి. మొదట రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం దాటి ముందుకు వెళ్తే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఇది శిల్పకళలో అద్భుతంగా ఉంటుంది. తదుపరి నవరంగ మండపం, అందమైన ద్వారపాలక విగ్రహాలు దర్శనమిస్తాయి.

గర్భగృహంలో ప్రతిష్ఠితమైన కుమారస్వామి విగ్రహాన్ని 18 సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్యవేక్షణలో తయారుచేశారని, ఇది అపురూపమైన 'నవపాషాణ' విగ్రహమని చెబుతారు. ఇందులో శక్తివంతమైన మూలికలు సమ్మేళనంగా ఉండేలా తయారు చేశారని విశ్వసిస్తున్నారు.

ఈ విగ్రహ విశిష్టత ఏమిటంటే — పూజా సమయాల్లో వెలువడే ఉష్ణానికి, మూలికా పదార్థాలు శక్తివంతమైన వాయువులను ఉద్గరిస్తాయని, ఆ వాయువులను పీల్చినవారికి కొన్ని వ్యాధుల దోషాలు తొలగిపోతాయని, ఆరోగ్యంగా మారతారని అంటారు.

ఈ మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి, భక్తులకు వరాలను ప్రసాదించే, కోరిన అభీష్టాలను తీర్చే కొండంత దేవుడిగా భాసిస్తారు. ప్రతి నెల కృత్తికా నక్షత్రానికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆషాఢ కృత్తిక నాడు విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు.

Wednesday, June 11, 2025

వాల్మీకి రామాయణం - 32

మిథిలా నగర సమీపాన జనశూన్యమైన ఆశ్రమం కనిపంచడం తో విశ్వామిత్రుడు ఆ ఆశ్రమం గురించి చెప్ప సాగాడు....

ఇది మహాత్ముడగు గౌతముని ఆశ్రమము. ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉండినది. దీనిని దేవతలు సైతము పూజించెడివారు.

ఇచ్చట గౌతముడు తన భార్యయగు అహల్యతో కూడినవాడై అనేక సంవత్సరములు తపస్సు చేసినాడు.

ఇంద్రుడు గౌతముని తపస్సును భగ్నము చేయబూని గౌతముడు ఆశ్రమమున లేని సమయము కనిపెట్టి మునివేషధారియై అహల్యను సమీపించి "నీతో క్రీడింపగోరుచున్నాను. నన్ను అనుగ్రహింపుము” అన్నాడు.

మునివేషమున వచ్చినవాడు ఇంద్రుడని తెలిసికొనియు అతని మీద ఆమెకు మనసు మరలినందున అహల్య సమ్మతించినది.

అహల్య :  ప్రభూ! కృతార్థురాలనైతిని. నీవు త్వరగా వెడలిపొమ్ము. నిన్నును నన్నును రక్షించుకొను
మార్గమును చూడుము.
నా మర్యాదను కాపాడుము.

గౌతముడు వచ్చునేమో యని శంకించి ఇంద్రుడు వేగముగా వెడలుచుండినాడు. కాని గౌతముడు స్నానము చేసి ఆశ్రమమునకు వచ్చుచుండినాడు. ఇంద్రుడు గౌతముని చూచి భయపడి వివర్ణుడైనాడు

[చేయగూడని పని చేసినచో ఇంద్రుడైన నేమి మరెవ్వడైన నేమి! ఇదే గతి! ]

గౌతముడుకూడ ఇంద్రునిచూచి కోపించి శపించినాడు.
దుర్మార్గుడా! నీవు విఫలుడ వగుదువుగాక” అని శపించినాడు. ఇంద్రుడు వెంటనే విఫలుడైనాడు (వృషణాలు కోల్పోవడం)

గౌతముడు అహల్యను సైతము శపించినాడు. “నీవు ఈ ఆశ్రమమునందే అనేక వేల సంవత్సరములు వాయు భక్షణము మాత్రము చేయుచు బూడిదలో శయనించి తపస్సు చేయుచు
ఏ ప్రాణికిగాని కనబడక యుందువు గాక .”

మునివర్జితమై భయంకరముగానుండు ఈ ఆశ్రమమునకు దశరథపుత్రుడగు శ్రీరాముడు ఏనాడు వచ్చునో ఆనాడు నీవు శుచివి కాగలవు.

శ్రీరామునికి అతిథి సత్కారము చేసి దాని వలన లోభ మోహములను వీడి నీవు నీ నిజరూపమును దాల్చి నా ఎదుట సంతోషమున నుండగలవు అని చెప్పినాడు.

ఇంద్రుడు తన తప్పును దేవతలవద్ద మొరపెట్టుకొనగా వారు మేష వృషణాలతో అతన్ని సఫలుడ్ని చేసినారు.

రామా..!ఇప్పుడు గౌతముని ఆశ్రమమునందు ప్రవేశించి అహల్యకు శాపవిముక్తి కలిగించు.

శ్రీరాముడు అడుగు పెట్టుట తోడనే తపస్సుచే ఇనుమడించిన కాంతితో తేజరిల్లుచుండిన అహల్య కానవచ్చినది.

శాపము అంతమైనందున వారికి కనబడినది రామలక్ష్మణులు అహల్య పాదములకు నమస్కరించినారు. శాపకాలమున గౌతముడు పలికిన మాటలను స్మరించి

అహల్య రామలక్ష్మణులకు అతిథి సత్కారము చేసి పూజించినది.
ఈ శుభసమయమున పుష్పవృష్టి కురిసినది. అప్సరసలు ఆడినారు. గంధర్వులు పాడినారు.

గౌతమ మహామునీశ్వరులు సైతము అచ్చటికి వచ్చినారు. చిరకాలము విడివడియుండిన అహల్యా గౌతములు కలుసుకొన్నారు. గౌతముడు కూడ శ్రీరాముని యథావిధిగా పూజించినాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట బెట్టుకొని మిథిలకు ప్రయాణమైనాడు.

      .,......సశేషం.......

Note  అహల్య శిలాగా మారడం,దేవేంద్రుడు కోడిగా రావడం ఇవన్నీ కల్పితాలు.వాల్మీకం కావు.

వాల్మీకి రామాయణం - 31

సముద్రమధనం లో దైత్యులందరిని సంహరించిన దేవేంద్రుడు దేవ రాజ్యానికి తిరుగు లేని అధిపతి అయ్యాడు..

దితికి భరింపరాని పుత్రశోకం ఏర్పడింది. భర్తయైన కాశ్యపుని దగ్గరకు వెళ్ళి - నాథా! నీ పుత్రులు నా పుత్రులను సంహరించారు.

నేను అపుత్రనయ్యాను. ఈ దుఃఖం భరించలేను. శక్రుని సంహరించగల పుత్రుడు - శక్రహంత నాకు కావాలి.
ఎంతైనా తపస్సు చేస్తాను. అనుగ్రహించు - అని ప్రాధేయపడింది.

దితీ ! నీ దుఃఖం అర్ధం చేసుకోగలను. నీకు శుభమగుగాక ! వెయ్యి సంవత్సరాలు తపస్సు చెయ్యి.

గడువు పూర్తయ్యే నాటికి నీవు శుచిగా ఉంటే నీ కోరిక తీరుతుంది - అంటూ కాశ్యపుడు చేతితో దితిని మెల్లగా నిమిరి - స్వస్తి అని తపస్సుకు వెళ్ళిపోయాడు.

దితి కూడా కుశప్లవంచేరి దారుణ తపస్సుకు పూనుకొంది.
దితి గర్భవతి అయింది. సహస్రాక్షునికీ సంగతి తెలిసింది.

కుశప్తవానికి వచ్చి దితికి పరిచర్యలు చేస్తూ అమాయకురాలైన ఆమెను సేవలతో సంతోషింపజేశాడు.

వేయి సంవత్సరాలు పూర్తిగా వచ్చాయి. పది సంవత్సరాలే మిగిలాయి

ఆయాసము అధికమై దితి ఒకనాడు అనుకోకుండా శయ్యానాసములో తలక్రిందులుగా శయనించింది.

సహస్రలోచనునికి ఆ దృశ్యము కనబడింది. సమయము చిక్కింది. శరీర లోకి సూక్ష్మ రూపంలో ప్రవేశించి, వజ్రి తన వజ్రాయుధముతో ఆమె గర్భమును తరుగసాగాడు.

లోపలి పిండము రోదింపసాగింది. "మారుదః" "మారుదః" "ఏడువ వద్దు, ఏడువ వద్దు'అని ఇంద్రుడు దితిభీతితో పలుక సాగాడు.

లోపలి శిశువు రోదనము దితికి హఠాత్తుగా మెలుకువను కలిగించింది. "చంపవద్దు", "చంపవద్దు అని దితి వారించింది శతక్రతువు శిశు సంహారాన్ని ఆపాడు.

అప్పటికే దితి గర్భము లోని పిండము ఏడు ముక్కలయింది. దితి తలక్రిందులుగా అశుచిగా పడుకోవడమే పిండచ్చేదానికి కారణమని పురువూతుడు వినీతుడై ఆమెకు విజ్ఞాపనం చేశాడు

ఇంద్రుని కాపట్యమును దితి గ్రహించింది. అయితే తాను తప్పుజేసింది. కనుక ఇంద్రుని ఏమనరాదు. తెలివిగా తన పిండములను రక్షించు కోవాలను కుంది.

తన గర్భములోని సప్త భాగములు "మారుదః" అనే ఇంద్ర వచనాన్ని బట్టి సప్త మరుత్తులై -అతనికి మిత్రులై సకలలోకాలలో సంచరిస్తారని తెలిపింది. శతక్రతువు అందుకు సమ్మతించాడు."

రామభద్రా! దితి తపస్సు చేసిన ఆ కుశప్లవ వనస్థలమిదే అని విశ్వామిత్రుడు వివరించాడు. ఇదే స్థలములో ఇక్ష్వాకునుకు "అలంబుస"అనే అతివయందు "విశాలుకు" ఆనే పుత్రుడు జన్మించాడు

ఆయన పేరుతోనే ఈ "విశాల పురము" వెలిసింది. విశాలుని వంశములోని వాడైన సుమతి ప్రస్తుత భూపతి అని తెలిపి విశ్వామిత్రుడు విరమించాడు...

( స‌శేష‌ము )

వాల్మీకి రామాయణం - 30

గంగావతరణ గాధను విశ్వామిత్రుని ద్వారా విన్న రామలక్ష్మణులు రాత్రి సుఖంగా గంగాతీరంలో నిద్రించి,

ఉదయం కావడంతోనే విశ్వామిత్ర సమేతంగా నౌకా సహాయంతో గంగోత్తర తీరం చేరి, అక్కడ విశాల పురాన్ని చేరారు.

రామ లక్ష్మణుల కోరిక పై మహర్షి విశాల పురి పూర్వవృత్తాంతాన్ని సముద్ర మథనగాధను వివరించాడు.

దేవతలు, దైత్యులు -తాము అజరులు, అమరులు కాదలచి క్షీరసాగరంలో నిక్షిప్తములయిన అమూల్య ఔషధాల సారాన్ని సేవింపదలచారు

క్షీరసాగరంలో మంధరాద్రిని కవ్వంగా జేసికొని, దానికి అనేక శిరస్సులు గల వాసుకి మహాసర్పమును త్రాడుగా చుట్టి, మధథనానికి సిద్ధమయ్యారు

సహస్ర సంవత్సరాలు అలా చిలుకగా, వాసుకి సహస్రశిరముల నుండి విషాగ్ని జ్వాలలు ఎగసి హాలాహలము ఉద్భవించింది.

దానిని పానం చేయడానికి భక్తవశంకరుడైన శంకరుడు ముందు కొచ్చాడు. ఆగరళాన్ని తనగరమందే నిలిపాడు

అనంతరము మళ్లీ మథనం మొదలైంది. మంధర మంధానము పాతాళము దాకా దిగిపోయింది. సురాసురుల ర్థనపై జగద్భర్త తాబేలుగా మారి తన వీపుపై మంధరాన్ని భరించాడు.

అంతేకాదు తానుకూడ ఉపేంద్రుడుగా ఆకవ్వాన్ని త్రిప్పసాగాడు
మరొక వేయి వర్గాలు గడిచాయి. దండ కమండల ధారియై ధన్వంతరి దివ్యవైద్యుడు ప్రభవించాడు.

అ సంఖ్యాకులైన అప్సరసలు ఆవిర్భవించారు ఆ అద్భుత సుందర సురభామినులను ఎవ్వరు స్వంతం చేసి కోవాలనుకోలేదు.

అందువలన వారు సర్వదేవతా సాధారణులుగా మిగిలిపోయారు
ఆతరువాత వరుణ పుత్రి వారుణి సురభాండంతో ఉదయించింది పరను సేవించిన దేవతలు సురలయ్యారు. దానిని ఆదరింపని దైత్యులు
అసురులయ్యారు

అనంతరము ఉచ్చైశ్రవము, ఐరావతము, కౌస్తుభమణి, కల్పవృక్షాలు కలిగాయి.

వచ్చిన ప్రతివస్తువును అదేలాభంగా ఆదితేయులు సొంతం చేసుకొన్నారు. అమృతమునే అంతిమ లక్ష్యంగా భావించిన అసుకులు మిగిలిన వస్తువులపై తమకము చూపక వాటిని దేవతలు తీసికొంటుంటే ఊరకున్నారు.

అంభోధి మథనాంతములో అమృతము ఆవిర్భవించింది. శ్రీమహావిష్ణువు స్వయంగా 'మోహిని" రూపము ధరించి అమృతాన్ని ఆదితేయులందరికి అందించాడు. 

అసురులకు అమృతము అందలేదు.
అమృత వినిమయాంతంలో -మోహిని మాయమయింది. మోసాన్ని గ్రహించి రాక్షసులు దేవతల పై యుద్ధాన్ని ప్రకటించారు.

అయితే భగవత్సహాయంతో దేవతలు రాక్షసులపై విజయాన్ని సంపూర్ణంగా సాధించారు.

ఇది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వినిపించిన క్షీరసాగర మధన వృత్తాంతము..

( స‌శేష‌ము )

వాల్మీకి రామాయణం - 29

సగర నిర్యాణము తరువాత అయోధ్యాధి పతిగా కోసలదేశ ప్రజలు అంశుమంతుని (మహారాజుగా)వరించారు.

కొంతకాలము రాజ్యపాలన గావించి, అంశుమంతుడు తన తనయుని దిలీవుని పట్టాభిషిక్తుని చేసి గంగావతరణోద్యోగము కొరకు తీవ్రముగా తపమొనర్చుతూనే స్వర్గ ప్రాప్తి పొందాడు.

దిలీపునికి కూడ గంగావతరణ మార్గము గోచరింపలేదు. ఆయన ముప్పైవేల సంవత్సారాలు యజ్ఞములను, ఇష్టులను కావిస్తూ అసంపూర్ణ మనోరథుడుగానే మరణించాడు

దిలీప తనయుడు భగీరథుడు, తన పూర్వులయిన అంశుమంత, దిలీప మహారాజుల ప్రగాఢ వాంఛ బాల్యమునుండే భగరథునిలో పట్టుదలను కల్గించింది.

ఆయన తరువాత అయోధ్యాధిపతిగా సింహాసనమలంకరింప దగిన వారసుడాయనకు జన్మింపలేదు. అయినప్పటికి ఆయన అసంతృప్తితో ఆగిపోలేదు.

మహామాత్యుల పై మహిభారాన్నుంచి -కఠోరతపోదిక్షతో ఆయన అడవులను ఆశ్రయించాడు.

సహస్ర వరములు గోకర్ణంలో భగీరథుడు ఘోరతప మాచరించాడు. భగీరథుని తపో దీక్షకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షము కాక తప్పలేదు గంగావతరణమున కంగీకరించాడు.

అయితే గంగార్భటిని భరించుటకు పరమశివుని ప్రసన్నం చేసికొమ్మని ఆదేశించాడు. స్వయంగా క్షమాశీల అయి సర్వంభర అయిన భూమి కూడత్రిపథగా వేగాన్ని భరింపజాలదని తెలిపాడు.

అంగుష్ఠమాత్ర స్థిరుడై భగీరథుడు మరొక వత్సరం తీవ్ర తపమాచరించారు. భక్త వశంకరుడైన శంకరుడు సంప్రీతుడై గంగాధారణకు తన సంసిద్ధతను తెలిపాడు.

ఆకసము నుండి మహావేగంతో గంగాదేవి క్రిందికి ఒక్కసారి దుమికింది క్రింద నిలిచి ఉన్న మహాదేవుని, మహీధరాన్ని భూతలంతోపాటు, పాతాళానికి కొట్టుక పోతానని అహంకరించింది హుంకరించింది.

రుద్రుడు గంగాదేవి ఉద్దతినిగాంచి, తనజటా మండల గహ్వరంలో మహావేగవతి అయిన స్వర్గంగను బంధించి స్తబ్దనుగావించాడు.

భగీరథుడు హతాశుడై తిరిగి పరమేశ్వరుని ప్రసన్నం చేసికొన్నాడు. ఒక్కొక్క గంగా బిందువును శివుడు క్రిందికి వదిలారు.

ఆ బిందువు హిమాచలము పై పడి "బిందు సరోవరమైంది". అక్కడి నుండి ఏడుపాయలై హలాదిని, పావని, నళిని అని మూడు నదులుగా తూర్పువైపు ప్రవహించింది.

సూచక్షువు, సీత, సింధూ నదముల రూపములతో పడమటి వైపు ప్రవహించింది. ఎడవ పాయగా భగీరథుని వెంట ఏతెంచసాగింది.

గగనము నుండి (గం)భూమిపైకి దిగి వచ్చే ఆగంగామతల్లిని దేవదానవ యక్ష మహర్షి సంఘములు మహాభక్తితో సేవింపసాగాయి. వారు ఆ పవిత్ర జలాల్లో స్నాన. పానాదులు చేశారు

భగీరథుని అనుసరిస్తూ గంగామతల్లి కన్న కుమారుని లీలగా అనుసరించే మాతృమూర్తి వలె ముందుకు అనుగమింప సాగింది.

మార్గమధ్యములో బహ్న మహర్షి తన ఆశ్రమంలో ప్రశాంతంగా తపస్సు చేసి కొంటున్నాడు. ఆయనను -ఆశ్రమాన్ని చూడగానే గంగా గమనంలో మళ్లీ మహోద్భృతి ప్రవేశించింది.

మహర్షి యజ్ఞవాటిక, ఆశ్రమము -పరిసర ప్రాంతమంతా
ప్రవాహమయమైంది

జహ్ను మహర్షి కనులు దెరిచాడు, ఆనదీ వేగాన్ని గమనించాడు. ప్రశాంతంగా గంగా జలాన్నంతటిని పానంజేశాడు.

భగీరథునికి తన వెను వెనుక సుడులు తిరుగుతూ ప్రవహించే గంగానది యొక్క సవ్వడి వినిపించలేదు ఆశ్చర్యంతో వెనుదిరిగి చూచాడు.

అతనికంతా అయోమయము కలిగింది ప్రవహిస్తూ వచ్చే పావన గంగానదికి బదులు (ప్రశాంత)తపోనిష్ఠా గరిష్ఠుడైన జహ్న మహాముని దర్శనమిచ్చాడు.

ఆయన ఆ మహాత్ముని మనసారా ప్రార్థించాడు. కరుణామయుడైన -ఆమహాను భావుడు తన దక్షిణ కర్ణం నుండి గంగా ప్రవాహాన్ని వినిర్గతం చేశాడు.

జప తపోనిష్ఠా గరిష్టుడైన జహ్న మహాముని మహా ప్రభావానికి స్వర్వాహిని సంభ్రమాశ్చర్య చకిత అయింది.

ఆయన మహిమకు లొంగి వినయంతో తనయ భావాన్ని వహించింది అందుకే "జాహ్నవి" అనే పేరు కలిగింది గంగానదికి.

మళ్ళీ భగీరథుని వెంట నడకసాగింది - సగర పుత్రులు త్రవ్విన సొరంగంలోకి - అదే సాగరం - ప్రవేశించింది

అక్కడ భస్మరాశులను ముంచెత్తింది. అరువదివేలమంది సగరపుత్రులూ గతకల్మషులై స్వర్గానికి వెళ్ళారు. అప్పుడు

చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు

రాజర్షీ ! భగీరథా ! సగరపుత్రులను తరింపజేశావు. సాగరంలో ఈ జలం ఉన్నంతకాలమూ సగరపుత్రులు స్వర్ణోకంలో శాశ్వతంగా ఉంటారు

గంగానది నీకు పెద్దకూతురు. నీపేర భాగీరథి అని పిలవబడుతుంది. ఇటునుంచి పాతాళంలోకి ప్రవేశిస్తుంది ఈ ఆకాశము - భూమి - పాతాళము ఇలా ముల్లోకాలలోనూ ప్రవహించడంవల్ల" త్రిపథగ" అనే విఖ్యాతి పొందుతుంది.

బ్రహ్మదేవునికి నమస్కరించి భగీరథుడు స్నాతుడై తర్పణాదికాలు ముగించి అయోధ్యకు చేరుకున్నాడు.

ప్రజలంతా ఆనందించారు. ధనధాన్య సమృద్ధులతో సుఖించారు
రామా ! ఇదీ గంగావతరణ కథ.

నువ్ నీవు కోరినట్టే సవిస్తరంగా తెలియజేశాను. సమయం దాటిపోతోంది - అంటూ లేచాడు....

( స‌శేష‌ము )..


Tuesday, June 10, 2025

వటసావిత్రీ వ్రతం - జ్యేష్ట శుద్ధ పూర్ణిమ

వట సావిత్రీ వ్రతం : జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించాలి వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి.

*జ్యేష్ట శుద్ధ పూర్ణిమ :*

దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ రోజు భూదేవిని పూజించడం మంచిది.

*వట సావిత్రీ వ్రతము :*

హైందవ సంస్కృతి లో, ఆధ్యాత్మిక జీవన విధానములో పురుషులతో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసము, కట్టుకున్న భర్త, బిడ్డలకోసం.

పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా ధైవారాధనలో నిమగ్నులైవుంటారు. ధర్మార్ధ, కామ, మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి. విధిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు దైవాన్ని ప్రసన్నము చేసుకొని కుటుంబ క్షేమం కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో "వట సావిత్రీ వ్రతము" ఒకటి ముఖ్యమైనది.

తన పాతివ్రత మహిమతో యమధరమరాజు నుంచి తన భర్త ప్రాణాలను మెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రిచెట్టును భక్తిప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామ, దాన భేద, దండోపాయాలను అవలంబించాలని యమధరమరాజు ప్రయత్నించినా ప్రతివ్రతామతల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు.

సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తున్నారు. పెళ్ళైన యువతులంతా వటసావిత్రీ వ్రతం నాడు కొత్త దుస్తులు ధరంచి, చుట్టుప్రక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రిచెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సిందూరంతో వటవృక్షాన్ని అలంకరించి, నూలుదారం పోగుల్ని చెట్టుమొదలు చుట్టూకట్టి, చెట్టుచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రిచెట్టు... ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భవిస్తారు. మర్రిచెట్టు వ్రేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు, క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా రకరకాలైన ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాసదీక్షలంటే ప్రాణం లేచివచ్చినట్లుండేది. మర్రివృక్షం లా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రీ వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పూలు, గాజులు, పసుపు కుంకుమలు వంటి అలంకరణ సామగ్రితో అలంకరిస్తారు.

పసువు కుంకుమలతో పూజిస్తారు, ధూపదీప నైవేధ్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన, విస్తారమైన ఈ వృక్షం కొమ్మకింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్ధిస్తారు. కొత్తగా పెళ్ళి అయిన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్దాలను నైవేద్యముగా పెడతారు. బందు మిత్రులందరినీ ఈ వ్రతానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు. భాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తముగా పూజలు జరిపిస్తారు. వ్రతము రోజు ఉదయాన్నే స్నానము చేసి, నూతన వస్త్రాలను ధరించి, శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రిచెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసము చేస్తారు. కొందరు చంద్రున్ని చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు. కొందరు ఒక పూట భోజనం చేస్తారు. మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ వటసావిత్రీ వ్రతము ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు.  నేపాల్ లోను, మనదేశంలొని బీహార్లో ఈ వటసావిత్రీ వ్రతాన్ని 500 ఏళ్ళుగా ఆచరిస్తున్నట్లు తెలుస్తొంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన "మిథిల"లో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు అధారాలు ఉన్నాయట.

*వ్రత విధానం...*

వట సావిత్రీ వత్రం చేసేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్ల వారుఝామున నిద్రలేచి తల స్నానం చేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి, మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి, సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపు తో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మను వైధవ్యాధి సకల దోష పరిహారార్ధం.

"బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం కరిష్యే’’
అనే శ్లోకాన్ని పఠించాలి.

వాల్మీకి రామాయణం-28

విశ్వామిత్ర ముని ఇక్షవాకు వంశ రాజైన సగర చక్రవర్తి గురించి చెబుతున్నాడు....

ఒకా నొక కాలమున సగర చక్రవర్తి  అశ్వమేధ యాగము నిర్వహిస్తున్నాడు. అతని యజ్ఞాశ్వము దేశాటనకై విడువబడింది.

అంశుమంతుడా అశ్వరక్షకుడుగా వెళ్లాడు. సంవత్సర కాలము సంపూర్ణమైంది. అశ్వము రాజధానికి తిరిగి వచ్చింది

యజ్ఞ సన్నాహాలు పూర్తి అయ్యాయి. క్రతువు ఆరంభము మరుసటి రోజే. రాక్షస' శరీరంతో ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించాడు.

రక్షింపబడని అశ్వము యజ్ఞ కర్తకు అనర్ధాన్ని కల్గిస్తుంది. సగరుడు దీక్షాబద్ధుడు -కనుక యజ్ఞ శ్వమును తీసికొని వచ్చుటకు తన అరవై వేల మంది పుత్రులను పంపాడు

వారందరు మహాసంరంభముతో హుటాహుటి బయలుదేరారు. భూమిని తమ వజ్రముష్టులతో బద్దలు కొడుతూ వెళ్లసాగారు.

దారిలో నాగులు అనుర రాక్షసులు మర్ధింపబడ్డారు. భూమి అంతా గుంటలు గుంటలుగా తవ్వబడసాగింది

ఈ హఠాత్ప్రళయానికి దేవదానవ, గంధర్వ, యక్ష రాక్షపాదులు బ్రహ్మకు మొరలిడగా భగవంతుడు "కపిల రూపధారియై, భూమి పైననే ఉన్నాడని ఆయనయే ఈ ఉపద్రవాన్నుండి రక్షిస్తాడని బ్రహ్మవచించాడు

ఆవిధంగా భూమంతా త్రవ్వి, దానిచుట్టూ పరిక్రమించి, ఎక్కడ కూడ యజ్ఞాశ్వం కాన రాక తిరిగి రిక్త హస్తులై సగరుని చేరారు

ఆయన పుత్రులు సగరుడు రోషసాగరుడై మళ్లీ భూమినంతటిని త్రవ్వి, అంతటా వెదికి అశ్వంతోనే తిరిగి రావాలని, కాని ఊరక రాకూడదని గద్దించాడు. .

సాగరులు మార్గ మధ్యములో పూర్వదిశలో "విరూపాక్ష దిగ్గజాన్ని, దక్షిణ దిశలో 'మహాపద్మ' మత్తేభాన్ని, ఉత్తర దిశలో "భద్ర'గజాన్ని, పశ్చిమ దిశలో 'సౌమనస్య "ద్విరదాన్ని దర్శించారు.

మళ్ళీ భూఖననం చేస్తూ వెళ్లి "కపిల మహర్షిని గాంచారు. ఆ మహానుభావుని "అశ్వాపహర్త'గా భావించి, ఆయన పైకి ఉరికారు వారి దుర్వత్తిని గమనించి కపిలుడు హుంకారము గావించాడు. సాగరులందరు భస్మమయ్యారు.

సగరుడు తన షష్టి సహస్ర సుతులు తిరిగి రానందున, అశ్వమును (తిరిగి) తేవడానికై తన మనుమని అంశుమతుని ఆజ్ఞాపించాడు.

ఆయన ఖడ్గధారియై బయలుదేరి, తమ పితరులు త్రవ్విన త్రోవలోనే పయనిస్తూ మార్గస్థుల మర్యాదలను స్వీకరిస్తూ, దిగ్గజాలను దర్శించాడు.

వాటి ఆశీర్వాదంతో చివరదాకా వెళ్లి అక్కడ భస్మీ భూతులైన పితరులను దర్శించి, దుఃఖ పరవశుడయ్యాడు

అక్కడికి సుపర్ణుడు గరుడుడేతించి, " అంశుమంతుని ఓదార్చి వారికి ఉత్తమ లోకావాప్తిని కల్గించడానికి, లోకపావనియైన గంగామతల్లిని అవతరింపజేయుమని ఆనతిచ్చి వెళ్లాడు.

ధైర్యమును చేజిక్కించుకొని, యజ్ఞాశ్వాన్ని తీసికొని సగరుని సమిపించాడంశుమంతుడు.

సగరుడు తన కొడుకుల దుర్మరణాన్ని గురించివిని కూడ యాథావిధిగా యజ్ఞము పూర్తి గావించు కొని ముప్పైవేల సంవ్సరాలు పాలన గావించి, గంగావతరణ విధిని నిర్ణయించకుండానే స్వర్గతుడయ్యాడు.

తరువాతి ఇక్ష్వాకు వంశ చక్రవర్తులు చరిత్రలను విశ్వామిత్రుడు చెప్ప సాగెను...

( స‌శేష‌ము )

వాల్మీకి రామాయణం -27

రామలక్ష్మణులు విశ్వామిత్ర బృందం తో గంగా నదీ తీరం చేరారు...గంగా నది గాధ ను విశ్వామిత్రుడు వివరింప సాగాడు....

హిమవంతునికి మేరు తనయ అయిన మనోరమ యందు గంగా,పార్వతులనే తనూజలు కలిగారు.

హిమవంతుని యాచించి దేవతలు గంగామతల్లిని తమ లోకానికి తీనికవెళ్లారు. అక్కడ సురనదీ రూపంలో గంగాదేవి స్వర్లోక వాసులను సంతృప్తి గావించింది.

పార్వతి మహోగ్ర తపము ద్వారా పరమశివుని సంప్రీతునిగావించి ,ఆ పరమేశ్వరునే పరిణయము చేసికొంది...

శివ పార్వతులు బహుకాలము భోగింప సాగారు. శివుని అమోఘ వీర్యమును కాలము గడిచిన కొలది భరించుట దుష్కరమని, దానివలన ప్రళయమే సంభవించునని భీతులై దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలిగించారు

సురుల కోరిక పై శివుడు తన తేజాన్నిసర్వక్షమాశీలయైన భూమిలో విడిచాడు. ఆమహాతేజము భూమియావత్తునిండి పర్వతాలను, వనాలను వ్యాపిస్తూ వసుంధరకు దుర్భరం కాసాగింది

ఆదితేయులు  అగ్ని దేవుని అవనితో పాటు శివ వీర్యమును ధరింపుమని ప్రార్థించారు. అగ్నిదేవుడు అందుకు అనుమతించాడు.

శ్వేత పర్వతము , దివ్యశరవణము మొదలైనవి శివ వీర్యప్రభవములయ్యాయి.
దేవతలు సంప్రీతులై ఉమామహేశ్వరుల నారాధించారు.

అయితే శర్వాణి వారి పరిచర్యలకు సంతుష్టురాలు కాలేదు. తనకు మహేశ్వరతేజము దక్కలేదనే కనుకతో స్వర్గ వాసులందరు సంతాన హీనులుగా మిగిలిపోతారని శపించింది.

తనకు దక్కని శివ వీర్యాన్ని ధరించిన భూమి నిరంతరము మార్పులను చెందుతూ స్థిరత్వము లేక అనేకులకు భార్యగా నుంటుందని కఠినోక్తి గావించింది

దేవతలకు రాక్షసులతో జరిగే యుద్ధాలలో సరియైన సేనాధిపతి లేక ఘోరబాధలు సంభవించాయి.

వారి మొరను వినిన పరమేశ్వరుడు అగ్నిదేవునితో తన తేజాన్ని గంగానదిలో విడువుమని ఆదేశించాడు.

గంగా,హుతవాహనుల సంగమం వలన కుమార సంభవము జరుగుతుందని ఆ బాలుడు పార్వతి సంప్రీతికి కూడ పాత్రుడౌతాడని-ఆయన దేవ సేనాని యై అనురులనణచుతాడని అభయ మొసగాడు మహేశ్వరుడు

సురల ప్రార్థనతో స్వర్గంగ స్త్రీరూప ధారిణియై అగ్నిదేవుని నుండి ఆ శివతేజాన్ని గ్రహించింది. కాని అఖిలలోకములకు ఆహ్లాదాన్ని కలిగించే అనదీమతల్లికి కూడ ఆతేజము దుస్సహమయింది.

ఆతల్లి ఆ వీర్యాన్ని తన జలాలలో వదిలింది. ఫలితంగా, బంగారము, సీసము, మొదలైన అతి మూల్యమైన లోహము లేర్పడ్డాయి.

చివరకు ఆతేజము నుండి హిమాలయ పాదస్తానములో గంగానది తీరములోని రెల్లు గడ్డిలో శివకుమారుడావిర్భవించాడు.

ఆ కుమారునికి పాలివ్వడానికి ఆరుగురు కృత్తికలు ముందుకొచ్చారు. ఆరుగురు తల్లుల పాలు ద్రావినందుకా కుమారుడు షాణ్మాతురుడయ్యాడు.

కృత్తికల చేపెంచబడినందు వలన కార్తికేయుడని ఖ్యాతి వహించాడు - ఆరు ముఖములలో ఏక కాలంలో ఆరుగురు తల్లుల స్తన్యము గ్రోలినందువలన

"షణ్ముఖుడు"అని ప్రసిద్ధినందాడు. శివతేజము స్కన్నమగుట ద్వారా సంభవించినందుల కాయన "స్కంధుడనే పేరును పొందాడు.

శివ వీర్యానికి కారణమైన పార్వతీదేవి ,దేవతలందరిలో శ్రేష్టత్వమును పొందింది, శివతేజము ధరించినందు వలన గంగానది నదులన్నిటిలో శ్రేష్ఠ వాహిని అయింది

శివ వీర్యాన్ని దేవతలు ఎంత భగ్నము చేయాలనుకొన్నా అది ఎన్ని స్థానాలలో పతనమైనా ,చివరకు ఆతేజము కుమారస్వామి సంభవానికి కారణమైంది.

కుమార సంభావాన్ని తెలిపిన విశ్వామిత్రుడు కొంత విరామము తరువాత ఇక్ష్వాకు వంశం లో శ్రేష్ఠుడైన సగర చక్రవర్తి గురించి చెప్ప సాగెను......

( స‌శేష‌ము )

Sunday, June 8, 2025

మూఢం అంటే ఏంటి?

మూఢం అనేది రెండు రకాలు*.
1) గురు మూఢం,
2) శుక్ర మూఢం అని అంటారు. ఇక ఇప్పుడు వచ్చేది  జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురు మూఢం.ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురు బలం, శుక్ర బలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి శుక్ర గ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూఢం అని అంటారు.

*మూఢం సమయంలో ఏం చేయకూడదు?*
మూఢం సమయంలో 1)పెళ్లిచూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు.
2)పెళ్లిళ్లు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్లు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు ఉన్నాయి.
శుభకార్యాలని ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది.
3)లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు.
4)మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పు.
5)పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు.
6) కొత్త వ్యాపారాలని మొదలుపెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
7)చెవులు కుట్టించకూడదు.
8)కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు
9)శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు.
10)ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. 11)దేవుడికి మొక్కలు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు.
12)వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు.
13)ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు.
14)చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

*మూఢం సమయంలో ఏం చేయవచ్చు?*
1)చిన్న పిల్లలకు అన్నప్రాసన చెయ్యచ్చు.
2)దూర ప్రయాణాలు చెయ్యచ్చు.
3)ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు.
4)భూముల అమ్మడం, భూములు కొనడం వంటివి చేయొచ్చు.
5)అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు.
6)రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు.
7)విదేశాలకు వెళ్లడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయొచ్చు.
8)కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు.
9)ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లొచ్చు.
10)దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం చేయొచ్చు.
11)నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు.
12)మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయచ్చు

వాల్మీకి రామాయణం-26

విశ్వామిత్ర యాగ సంరక్షణ తరువాత సిద్ధాశ్రమ ఋషులు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు  మిధిలేశుని శివధనుస్సు గురించి ముచ్చటించారు

తెల్లవారి విశ్వామిత్రుడక్కడి ఋషుల నక్కడే నిలిపి వారి సెలవు తీసికొని - ఆ ఆశ్రమమును విడిచి రామలక్ష్మణులతో కూడి ఉత్తర దిశకు బయలుదేరాడు

వారు ఆసాయంత్రము శోణా నదీతీరము చేరుకొని స్నానసంధ్యాదులు ముగించుకొన్నారు. రామలక్ష్మణుల కోరిక పై విశ్వామిత్రుడు కుశనాభుని చరిత్రము వినిపించాడు

బ్రహ్మ తనూజుడైన కుశమహర్షి వైధర్భియందు కుశాంబుడు, కుశనాభుడు అధూర్త రజసుడు, వసువు అను కుమారులను కల్గి ఉండెను.

వారు వరుసగా కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరవ్రజము అనే నాలుగు నగరాలను నిర్మించి పాలించారు

కుశనాభునికి సర్వాంగ సుందరులైన నూరుగురు కుమార్తెలు కలిగారు వారు యౌవనాభరణ భూషితలై ఒకనాడు ఉద్యానవనములో విహరిస్తుండగా

వాయుదేవుడు వారిని మోహించి గాంధర్వ వివాహము చేసికోదలిచాడు.  ఆయువతులందుకు నిరాకరింపగా, ఆగ్రహముతో వాయువు వారినందరిని కుబ్జలుగా మార్చాడు.

కుశనాభుడు వారి వికృత రూపములగాంచి దుఃఖించి పెద్దలను సంప్రదించి, మహానుభావుడు, ఊర్మిళా చూళీ తనయుడైన బ్రహ్మదత్తునికి వారిని కన్యాదానముగావించాడు.

బ్రహ్మదత్త కరగ్రహణముతో వారందరికీ అపురూప లావణ్యశోభలు యథా పూర్వము సంప్రాప్తించాయి.

కుశనాభుడు తన శతసుతలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహము చేసి పంపాక, తనకు సంతానము లభించాలని, పుత్రకామేష్టిగావించాడు.

బ్రహ్మతనయుడైన కుశమహర్షి ఆశీర్వాద ఫలితంగా ఆయనకు "గాధి' అనే తనూజుడు కల్గాడు.

ఆ గాధి నా తండ్రి అని విశ్వామిత్రుడు చెప్పాడు, మరియు గాధికి సత్యవతి అనే తనయకలిగారు. సత్యవతికి ఋచీకుడనే మహర్షితో పరిణయము జరిగింది.

ఋచీక నిర్గమనముతో సత్యవతి "కౌశికీ" అనే పుణ్యనదీరూపము ధరించి లోకాన్ని పావనం చేస్తుంది.

ఆ నదీతరంలోనే నేను ఆశ్రమము నిర్మించుకొని తపస్సు జేశాడు. అక్కడి నుండి దక్షిణము దిశలో నున్న సిద్ధాశ్రమమునకు వెళ్లి

యాగములు చేస్తూ -వాటికి నిరంతర విఘ్నములు కలుగగా వాటిని స్వప్రయత్నముతో నివారింప జాలనని నిర్ణయించుకొని -దశరథ తనయుడైన నిన్ను శరణు వేడి -నీ పై రక్షణ భారము సంపూర్ణంగా ఉంచి యజ్ఞం పూర్తి చేశాను.

కుశుని వంశములో పుట్టుటచే నాకు కౌశికుడు అని పేరు వచ్చినది. విశ్వమునకు హితము కలిగించు మిత్రుడనగుటచే నన్ను విశ్వామిత్రుడు అని కూడ వ్యవహరింతురు.

ఆ శోణా నది తీరం లో రామ లక్ష్మణులు మాహర్షులతో కలసి ఆ రాత్రి నిద్రించారు....

ఉదయం చేయవలసిన కృత్యాలు పూర్తి చేసి తిరిగి ప్రయాణం సాగించారు....మధ్యాహ్నా సమయానికి గంగా నది చేరారు.....

( స‌శేష‌ము )

వాల్మీకి రామాయణం-25

విశ్వామిత్రునితో కలసి  రామలక్ష్మణులు సిద్ధాశ్రమం చేరారు...
విశ్వామిత్రుడు వెంటనే యజ్ఞ దీక్ష స్వీకరించాడు.

రామ లక్ష్మణులు ఆ రాత్రికి విశ్రమించారు. ఉదయం లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని విశ్వామిత్రుని నమస్కరించి.....

మహర్షి!కాక్షసులు ఏ సమయం లో వస్తారు?మేము ఎప్పుడు యాగ రక్షణ పూనుకోవాలి అని ప్రశ్నించగా.....

సమీపం లో ఉన్న ఇతర మునులు సమాధానం గా
రాఘవులారా ! నేటినుంచి ఆరురోజులు రేయింబవళ్ళు మీరు రక్షణ బాధ్యతను వహించాలి.

మహర్షి యాగదీక్షలో భాగంగా మౌనవ్రతం స్వీకరించారు. పలకరు.
ఈ మునుల వాక్యాలు విని రామలక్ష్మణులు ఆరురోజులపాటూ రేయీపగలూ

తేడా లేకుండా రెప్పవాల్చకుండా రక్షణలో నిమగ్నులయ్యారు. ధనుర్ధారులై యాగశాలనూ విశ్వామిత్రుణ్నీ సంరక్షిస్తున్నారు.

అయిదు రోజులు గడచిపోయాయి. ఆరవరోజు వచ్చింది. సౌమిత్రీ ! సావధానం. సిద్ధంగా ఉండు అని రాముడు హెచ్చరించాడు.

అంటుండగానే భీకరమైన మారీచ సుబాహులు అనుచరులతో ఆకాశం లో
ఆవరించి రక్తం కుమ్మరించారు...

లక్ష్మణా అదిగో చూడు రాక్షసులు వీళ్ళని మానావాస్త్రం తో ఎగరగిడుతాను అంటూ అంభిమంత్రించి అస్త్రాన్ని ప్రయోగం చేసాడు...

మారీచుడు మూర్ఛపోయి శతయోజనమ్ దూరం లో దాటి సముద్రం ఒడ్డు న పడెను. ఈ అస్త్రం తో తెలివి తప్పి నాడు కానీ చనిపోలేదు.

మిగిలిన రాక్షసులైన  సుబాహువు గుండెలపై ఆగ్నేయాస్త్రం సంధించాడు, వాడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు...

వాయవ్యాస్త్రం తో మిగిలిన రాక్షసులు అంతమొందారు.
ఈ విధముగ రాక్షసులనందరిని అంత మొందించిన రాముని చూచి అచట మునులందరు సంతోషముతో పూజించిరి.

యజ్ఞము సమాప్తమైనది. దిక్కులన్నియు ప్రకాశించుచుండెను. విశ్వామిత్రుడు సంత సించెను. రామునితో మహాబాహూ! రామా! నేను కృతార్థుడనేతివి.

గురువు వాక్యమును నీవు నెరవేర్చితివి.సిద్దాశ్రమము అనెడి పేరు ఈనాడు సార్ధకమైనది" అని అనెను.

మునిసింహమా ! ఇదిగో కింకరులం ఇద్దరము, నీ సన్నిధిని నిలబడ్డాం. ఆజ్ఞాపించు. నీ ఇష్టం. ఏమి ఆనతి ఇస్తే అది ఆచరిస్తాం.

ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ౹
ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిమ్ ||

ఇలా సవినయంగా పలుకుతున్న రామునివైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ మునులంతా ముక్తకంఠంగా బదులు పలికారు.

మిథిలాధిపతియైన జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అది చూడడానికి మేమంతా వెడుతున్నాం. మీరు మాతో రండి అని ఆహ్వానం పలికారు...

( స‌శేష‌ము )

వాల్మీకి రామాయణం -24

రామ లక్ష్మణులు విశ్వామిత్రుడు ముగ్గురు తాటకా వనం లో రాత్రి నిద్రించారు....

ఉదయం విశ్వామిత్రుడు రామునితో స్నానమాచరించి రమ్మని...
అనేక రకాల దివ్యాస్త్రాలను ఉపదేశం చేసాడు....

వాటి ఉపసంహరాలను సైతం ఉపదేశం చేసాడు.రాముడు వాటిని తదేక దృష్టి తో  ధ్యానం చేసాడు అవి అన్ని ప్రత్యక్షమయ్యాయి.

ఓ దివ్యాస్త్రములారా న మనసులో వశించండి తగిన సమయం లో సహకరించండి.అని ఆదేశించాడు  అవి రాముని ఆజ్ఞను శిరశావహిస్తాము అని చెప్పి మారలినాయి.....

విశ్వామిత్రిని వెంట రాముడు లక్ష్మణుడు నడక సాగిస్తున్నారు.....
మేఘ మండల సదృశం గా ఓ పెద్ద వృక్ష సమూహం కనపడింది....

రాముడు ప్రశ్నించాడు....
విశ్వామిత్రుడు సమాధానం గా....
హే మహాబాహో ! రఘురామా ! విష్ణుమూర్తి కొన్ని వందల యుగాలపాటు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకున్నాడు.

వామనునికి ఇదే పూర్వాశ్రమం. దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడ మహా తపస్సులు సిద్ధిస్తాయి.

విష్ణుమూర్తి ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలోనే విరోచనుని కొడుకు బలి- ఇంద్రునితో సహా సర్వదేవతలనూ జయించి ముల్లోకాలనూ తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు.

ఆ సందర్భంగా ఒక మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ సమయంలో సర్వదేవతలూ ఈ ఆశ్రమానికి వచ్చి, బలి చేస్తున్న యజ్ఞ వార్తను విష్ణుర్తికి విన్నవించి

ఆ యజ్ఞం పూర్తి అయ్యేలోగానే దేవకార్యం చక్కబెట్టమని అభ్యర్థించారు. ఎవరు ఎక్కడ ఏది ఎంత అడిగితే అదల్లా ఇచ్చేస్తాడట బలి.

హే విష్ణు ! దేవహితం కోసం నీవు వామనుడవై మాయాయోగంతో మాకు మేలు చేకూర్చు - అని ప్రార్ధించారు సరిగ్గా అదే సమయానికి

అదితి సహితుడైన కాశ్యపుడు, విష్ణు ప్రీతికోసం వేయి సంవత్సరాల మహావ్రతం పూర్తిచేసుకొని, అక్కడకు వచ్చాడు.

తపోమయుడు, తపోమూర్తి తపోరాశి అయిన కాశ్యపునికి సంతోషించి విష్ణుమూర్తి వరం అడగమన్నాడు.

మహానుభావా ! నీ శరీరంలో సమస్త జగత్తునూ చూస్తున్నాను. నీవు అనాదివి. అనిర్దేశ్యుడవు. శరణు మహాప్రభూ! శరణు శరణు ఈ యాచిస్తున్న దేవతలకూ మా దంపతులకూ సంతోషకరంగా ఒకే వరం అడుగుతున్నాను అనుగ్రహించు.

నీవు మాకు పుత్రుడవుగా అవతరించు. మా పెద్దకుమారుడు ఇంద్రునికి సోదరుడవై శోకార్తులైన ఈ
దేవతలకు సహాయం చెయ్యి.

ఉత్తిష్ఠ భగవన్! ఇకనుంచి ఇది సిద్ధాశ్రమ నామంతో ప్రసిద్ధికెక్కుతుంది.
కాశ్యపుని ప్రార్ధనను విష్ణుమూర్తి మన్నించాడు. అదితి గర్భంలో వామనుడుగా జన్మించాడు.

బలిని సమీపించాడు. మూడడుగులు యాచించాడు. ముల్లోకాలనూ ఆక్రమించాడు. బలిని అదుపుచేసి దేవేంద్రునికి దేవరాజ్యం తిరిగి అప్పగించాడు.

రామా ! ఇది ఆ మహామహుడు వామనుడు నివసించిన ఆశ్రమం. భక్తి ప్రపత్తులతో నేనుకూడా ఇక్కడే ఉంటున్నాను

యజ్ఞ విఘ్నకారులైన రాక్షసులు ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడే నీవు వారిని సంహరించాలి

నాయనా ! రామా ! రా ! ఉత్తమోత్తమమైన సిద్ధాశ్రమంలో కిప్పుడే ప్రవేశిద్దాం...

( స‌శేష‌ము )

Friday, June 6, 2025

వాల్మీకి రామాయణం -23

రామ లక్ష్మణ విశ్వామిత్రులు గంగా నది దాటి దక్షిణ తీరానికి చేరారు....

రామచంద్రుడు దట్టమైన అడవి గురించి ప్రస్తావించాడు....విశ్వామిత్రుడు సమాధానం గా....

ఒకప్పుడు ఇక్కడ మలద అనీ కరూశమనీ రెండు జనపదాలు ఉండేవి. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో కూడా చెబుతాను.

వృత్రాసురుణ్ని సంహరించినందువల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొంది. ఆ మలంతోపాటు తీరని దాహం కూడా కలిగింది

అప్పుడు తపోధనులైన మహర్షులు కలశాలతో మంగళోదకాలను తెచ్చి ఇక్కడ దేవేంద్రునికి స్నానం చేయించారు మలమూ దాహమూ (కరూశము) వదిలించారు.

సంతుష్టుడైన శచీపతి ఆ జనపదాలకు మలదము కరూశము అని నామకరణం చేసాడు. ఇవి ధనధాన్య సమృద్ధితో చాలాకాలం విరాజిల్లాయి.

కొంతకాలానికి వెయ్యి ఏనుగుల బలం కలిగి కామరూప సంచారిణి అయిన ఒక యక్షిణి వచ్చింది. తాటక దానిపేరు.

రామా! భద్రమగుగాక. అది సుందుని భార్య. ఇంద్రపరాక్రముడైన మారీచుడు దాని కుమారుడు.ఇద్దరూ కలిసి మలద కరూశ జనపదాలను పూర్తిగా నాశనం చేసారు.

ఇదే దారిని ఆక్రమించుకొని సుమారు ఒక క్రోసెడు దూరంలో తాటక నివసిస్తోంది. ఈ దారినే వెళ్ళాలి మనం.

ఈ తాటకికి బ్రహ్మ వల్ల వర బలం ఆగస్త్యుని వలన శాపబలం రెండూ ఉన్నాయి.

స్త్రీ వధ కదా మహాపాతకం అని శంకించకు. సర్వజీవకోటికీ హితం కోరిన రాకుమారునికి ఇది కర్తవ్యం.

ప్రజారక్షణకోసం క్రూరమూ పాతకమూ దుష్టమూ అయిన పనులనుకూడా
రాజు చెయ్యవలసి ఉంటుంది. తప్పులేదు. రాజధర్మం. అటువంటిది.

అపుడు రాముడు విశ్వామిత్రునకు నమస్కరిస్తూ...
మహార్షీ ! అయోధ్యలో గురువుల సాక్షిగా మా తండ్రి నన్ను నీకు అప్పగించినపుడు “విశ్వామిత్రుని మాట జవ దాటవద్దు" అని ఆజ్ఞాపించాడు.

ప్రస్తుతం తాటకను సంహరించమని నీ శాసనం. చాలు. తాటకను సంహరిస్తాను సందేహం లేదు.

గో బ్రాహ్మణహితం కోరి దేశసౌఖ్యం కోరి అప్రమేయ ప్రభావుడవైన నీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను. తాటకను సంహరిస్తున్నాను.

ఆ యక్షిణి కామరూపధారణ శక్తితో అనేక రూపాలు ధరిస్తూ అంతలోనే అంతర్ధానం అవుతూ, శిలావర్షం ఎడతెరిపి లేకుండా కురిపిస్తూ,

భయంకరంగా అరుస్తూ, రామలక్ష్మణులను దారుణంగా చీకాకు పరిచింది.ఇద్దరూ రాళ్ళవానలో మునిగిపోతున్నారు.

గాధినందనుడు విశ్వామిత్రుడు గమనించాడు. రామా! ఇంక చాలయ్యా నీ దయ. ఇది పాపిని. యజ్ఞ విఘ్నకారిణి. మాయతో ఇలా ఇంకా పెరిగిపోతుంది సాయంకాలం కాబోతోంది.

సంధ్యా సమయంలో రాక్షసుల మాయలు మరీ విజృంభిస్తాయి. అందుకని వెంటనే సంహరించు.....

వెంటనే రాఘవుడు శబ్ద వేధిని సంధించి విడిచిపెట్టాడు. అది శిలావర్షాన్ని ఛిన్నభిన్నంచేస్తూ వెళ్ళి అదృశ్యరూపంలో ఉన్న తాటకకు తగిలింది.

అది రూపం ధరించి భూనభోంతరాళాలు మారు మ్రోగేటట్టు అరుస్తూ రాఘవులను తరుముకుంటూ వచ్చింది. పిడుగులా వచ్చి పడుతున్న తాటకను తీక్షంగా చూసాడు రాముడు.

దృఢ బాణం సంధించి గుండెలలో కొట్టాడు. అది కుప్పకూలిపోయింది. విలవిల లాడిపోయింది. బీభత్సంగా రోదిస్తూ గిలగిలా తన్నుకుని తన్నుకుని చచ్చిపోయింది.

ఆకాశంలో దేవేంద్రుడూ దేవతలూ సాధునాదాలు చేసారు. విశ్వామిత్రా ! నీకు జయమగుగాక ! మేమంతా ఆనందపరవశులమవుతున్నాం.

రాఘవులపట్ల స్నేహం ఇలాగే కొనసాగించు.  నీ దివ్యాస్త్రాలను రాఘవునికి ఉపదేశించు. నీకు శుశ్రూష చేస్తున్నాడు.

పైగా ఇతనితో దేవతలకు చాలా పెద్ద అవసరం (పని) ఉంది. ఇలా పలికి ఇంద్రాదులు వెళ్లిపోయారు.....

విశ్వామిత్రుడు అభినందన పూర్వకంగా రాముణ్ని అక్కున జేర్చుకున్నాడు. శిరస్సు మూర్కొన్నాడు. రామా!  ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం.

రేపు నా ఆశ్రమానికి వెళదాం అన్నాడు. ముగ్గురూ ఆ రాత్రి ఆ తాటకావనంలోనే సుఖంగా విశ్రమించారు. శాప విముక్తమైన ఆ వనం చైత్రరథంలా ప్రకాశించింది......

ఋతవస్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే | మంగళాని మహాబాహో! దిశంతు తవ సర్వదా |

(గొప్ప బాహువులు కల ఓ రామా...! ఋతువులు, సముద్రములు, ద్వీపములు,  వేదములు, లోకములు, దిక్కులును మంగళద్రవ్యములకు గూడ శ్రేష్ఠతను చేకూర్చునవై నీకు మంగళ మొసంగుగాక!)...

( స‌శేష‌ము )

వాల్మీకి రామాయణం - 22

విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణులు సరయూనది దక్షిణాతీరం చేరారు.
రామా..! అని విశ్వామిత్రుడు మధురం గా పిలిచాడు...

వత్సా! త్వరగా నదిలో ఆచమించి రా! ముహూర్తవేళ మించిపోకుండా బల ల అతిబలలు ఉపదేశిస్తాను. స్వీకరించు. ఇవి దివ్య మంత్రాలు,

వీటిని ఉపాసిస్తే నీకు శ్రమ ఉండదు. జ్వరం ఉండదు. రూపంలో మార్పురాదు నిద్రలో కూడా రాక్షసులు నిన్ను ఏమీ చెయ్యలేరు.

బాహుపరాక్రమంలో బుద్ధి నిశ్చయంలో కీర్తిలో నీకు సాటివచ్చే వీరుడు ముల్లోకాలలోనూ ఉండడు. ఈ బల అతిబలలు సర్వజ్ఞానానికీ తల్లులు. వీటిని పఠిస్తే మార్గాయాసమూ క్షుత్పిపాసలూ ఉండవు.

ఇవి బ్రహ్మపుత్రికలు. నీకు ఉపదేశిస్తాను. నీవు అర్హుడవు. సమస్త సద్గుణాలూ నీకు ఉన్నాయి నిన్ను ఆశ్రయించి ఈ విద్యలు రాణిస్తాయి. త్వరపడు. సూర్యాస్తమయం కాకముందే శుచిపై వీటిని స్వీకరించు

రాముడు త్వరత్వరగా సరయూనదిలో దిగి ఆచమించి శుచిగా వచ్చి ఆ విద్యలు స్వీకరించాడు. రామునిలో ఒక కొత్త కాంతి వెల్లివిరిసింది.

శరత్కాల సూర్యునిలాగా ప్రకాశించాడు. మంత్రోపదేశం ఇచ్చిన గురువుకు చెయ్యవలసిన ఉపచారాలన్నీ యథావిధిగా రామలక్ష్మణులు నిర్వహించారు.

గడ్డి పరుచుకొని ముగ్గురూ ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు.
తెల్లవారింది. తృణశయనం మీద నిద్రిస్తున్న రాకుమారులను చూసాడు విశ్వామిత్రుడు.

కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్||

కౌసల్యానందనా ! రామా! ప్రాతస్సంధ్య నడుస్తోంది, నిద్రలే! నరోత్తమా ! దైవ సంబంధమైన ఆహ్నిక క్రియలు సంధ్యావందనాదులు, నిర్వర్తించాలి గదా!
మేలుకొల్పుతో రామలక్ష్మణులు నిద్రలేచారు.

స్నాన సంధ్యాదులు ముగించారు. ప్రయాణానికి సిద్ధమై మునికి నమస్కరించి నిలిచారు. మార్గదర్శకుడుగా మహర్షి నడిచాడు. రామలక్ష్మణులు యథావిధిగా అనుసరించారు

అల్లంత దూరాన సరయూ సంగమస్థలంలో గంగానది కనిపించింది. ఆ సమీపంలో ఒక ఆశ్రమం కనిపించింది దానిని చూడగానే రామలక్ష్మణులకు అది ఎవరి ఆశ్రమమో ఏమిటో తెలుసుకోవా లనిపించింది.

మహర్షిని అడిగారు
ముని చిరునవ్వులో వివరించాడు.
కందర్పుడూ కాముడూ అని ఒకడున్నాడు. అతడు ఒకనాడు - ఇక్కడ తపస్సు చేసుకుంటున్న శివునిమీద దుర్బుద్దితో విజృంభించాడు.

శివుడు హుంకరించాడు. నేత్రాగ్నిని వెదజల్లాడు. మన్మథుని శరీరాంగాలు ప్రశిథిలమై పోయాయి. అప్పటినుంచీ అనంగుడయ్యాడు. ఆ కారణంగా ఈ ప్రదేశాన్ని అంగదేశం అంటారు.

ఇది అప్పటి ఆ పరమశివుని ఆశ్రమం. ఇప్పుడో ఎవరో శిష్యులు ఉంటున్నారు. వీరు ధర్మపరులూ, పాపరహితులూను.
శుభదర్శనా ! రామా! ఇరువైపులా పవిత్రనదులు.

ఈ రాత్రికి ఈ నడుమభాగాన విశ్రమిద్దాం. రేపు నదిని దాటుదాం
ఆ ఆశ్రమ మునీశ్వరుల సాయం తో గంగా తీరం దాటుతున్నారు నది మధ్య లో పెద్ద ఘోష వినపడింది....

ఈ శబ్దం ఏమని రాముడు ప్రశ్నించాడు...
రామా! కైలాస శిఖరంమీద మానస సరస్సు ఉంది. దానిని బ్రహ్మదేవుడు మనస్సుతో నిర్మించాడు.

అందుకని అది మానస సరస్సు అయ్యింది. దానినుంచి జారిన నది మీ అయోధ్యకు చుట్టూ ప్రవహిస్తోంది. సరస్సునుంచి జారినది కాబట్టి దానికి సరయువు అని పేరు ఏర్పడింది.

ఆ సరయూనది ఇక్కడ గంగానదిలో కలుస్తోంది. అదే ఆ హోరు. ఈ నదీ సంగమ స్థలానికి నియతితో నమస్కరించు.....ఇరువురు నమస్కరించారు

నది దక్షిణ తీరానికి చేరారు...
ఓ దట్టమైన అడవి అందులోకి ప్రవేశించారు. రాముడు ఆశ్చర్యం తో ప్రశ్నించాడు ఏమి ఈ దట్టమైన అడవి? అనేకరకాల పక్షులు,కీచురాళ్లు,సింహ శార్దూల కౄరమృగాల అరుపులు...?

విశ్వామిత్ర మహర్షి సమాధానం చెబుతున్నాడు.......

( స‌శేష‌ము )

వాల్మీకి రామాయణం -21

విశ్వామిత్రుడికి కోపం వస్తోందన్న విషయాన్ని విశిష్టుల వారు గ్రహించి దశరథుని తో.....

మహారాజా! దశరథా ! ఇక్ష్వాకు వంశలో జన్మించావు. సాక్షాత్తు ధర్మస్వరూపుడుగా జీవిస్తున్నావు.

స్థిరచిత్తం కలవాడవు. నీవు ధర్మాన్ని విడిచిపెట్టడం తగని పని సుమా ! ముల్లోకాలలోనూ ధర్మాత్ముడుగా నీవు ప్రసిద్ధుడవు.

ఆ పేరు నిలబెట్టుకో. అధర్మాన్ని అప్రతిష్ఠనూ నీవు భరించలేవు. యజ్ఞయాగాలు చేసి సప్త సంతానాలు స్థాపించినా ఆడినమాట తప్పితే అంత పుణ్యమూ నిష్ఫలమైపోతుంది. అందుచేత రాముణ్ని పంపించు.

కృతాస్తుడో అకృతాస్త్రుడో రామునికి
ఏ కీడూ ఏ ఆపదా కలగదు. అగ్నిసంరక్షితమైన అమృతంలాగా విశ్వామిత్రుని సంరక్షణలో ఉన్న రాముణ్ని రాక్షసులు ఏమీ చెయ్యలేరు.

ఈ విశ్వామిత్రుడెవ రనుకుంటున్నావు? రూపు దాల్చిన ధర్మం. బలవంతులలోకెల్లా బలవంతుడు బుద్ధిమంతులలో కెల్లా బుద్ధిమంతుడు.

తపస్సుకు పరాకాష్ఠ.ముల్లోకాలలోనూ సచరాచర సర్వ ప్రకృతిలోనూ విశ్వామిత్రునికి తెలియనిది లేదు.

ఇతడు ఎరుగని అస్త్రం లేదు ఇతడిని తెలుసుకొన్నవాడుగానీ ఇతనికి తెలిసినన్ని తెలిసినవాడుగానీ మరొకడు లేడు, ఉండబోడు.

ఇక్ష్వాకువంశవర్ధనా ! మరొక విశేషం ఆలకించు. ఈ కుశికనందనుడు రాజ్యం ఏలుతున్న సమయంలో భృశాశ్వుడు తన సంతానమైన వంద దివ్యాస్త్రాలనూ ఇతనికి సమర్పించాడు.

దక్షప్రజాపతికి దౌహిత్రులైన ఆ దివ్యాస్త్రాల శక్తి వర్ణనాతీతం. జయ-సుప్రభ అనే దక్ష ప్రజాపతి పుత్రికలు ఈ అస్త్రాలకు మాతృమూర్తులు.

అసురసైన్య వినాశనం కోరి ఏబదేసి అస్త్రాలను వీరు ప్రసవించారు. అవన్నీ ఈ విశ్వామిత్రునికి వశంవదమై ఉంటాయి. వాటి ప్రయోగోప సంహారాలు నేర్చినవాడూ నేర్పగలవాడూ ఇతడొక్కడే.

ఇటువంటి మహాతేజస్సంపన్నుడైన విశ్వామిత్రుని వెంట రాముణ్ని పంపడానికి సంశయించకు.
ఇలా వసిష్ఠుడు చెప్పగా దశరథుని మనస్సు కలత దేరింది.

సంతోషంగా రామలక్ష్మణులకు కబురు పంపించాడు కౌసల్య ఆశీర్వదించి పంపింది. సుమిత్రా కైకా ఆశీర్వదించారు.

వసిష్ఠుడు మంత్రరూపంలో శుభం పలికాడు. ఒక్కసారి గట్టిగా కౌగిలించుకొని శిరస్సు ఆఘ్రాణించి దశరథుడు రాముణ్ని విశ్వామిత్రునికి సంతుష్టాంతరంగుడై అప్పగించాడు.

రాజీవలోచనుడైన రాముడు ఇప్పుడు విశ్వామిత్రుని పక్షాన నిలబడ్డాడు. శుభసూచకంగా దుమ్మూ ధూళీ లేని చల్లనిగాలి వీచింది.

పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. శంఖారావాలు వినిపించాయి. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు బయలుదేరారు.....

ముందు విశ్వామిత్రుడు అతివేగంగా - వెనక్కు తిరిగి చూడకుండా నడుస్తున్నాడు. కాకపక్ష ధరుడై ధనుర్బాణాలు ధరించి రాముడు అనుసరిస్తున్నాడు.

అతని వెంట లక్ష్మణుడు నడుస్తున్నాడు. బ్రహ్మదేవుని వెంట అశ్వినీ దేవతల్లాగా, శివునివెంట అగ్నిశిఖల్లాగా నడుస్తున్నారు.

మూడుతలల పాములాగా నడక చరచరా సాగుతోంది యోజనమూ మరో అర్ధయోజనమూ నడిచి సరయూ దక్షిణతీరం చేరారు.....

( స‌శేష‌ము )

Thursday, June 5, 2025

అంతర్జాతీయ సినిమా సంగతులు: మూవీ: హర్ (Her – 2013)

*"నాకు అనిపిస్తోంది… ఇకపై కొత్తగా ఏమీ అనిపించదు. ఏ భావన వచ్చినా... ఇప్పటికే అనుభవించినదానికి చిన్న రూపమే ఉంటుంది."*
థియోడోర్ అనే ఒంటరిగా ఉన్న రచయిత (జోక్విన్ ఫీనిక్స్) సామ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఆమె స్వరంగా మాత్రమే వినిపించేలా ఉంటూ, తన భావాలను అర్థం చేసుకుంటూ, చక్కగా మాట్లాడుతుంది. ఈ కృత్రిమ మేధస్సు తాను అభివృద్ధి చెందుతూ, మనసును తాకే ప్రేమను అందిస్తుంది.
దర్శకుడు స్పైక్ జోన్జ్ ఈ కథను చాలా భావోద్వేగంగా, నూతనంగా చూపించారు. ఈ సినిమాకు ఉత్తమ కథకుడిగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.

💡**తెలుసా?**

* స్కార్లెట్ జోహాన్సన్ స్క్రీన్ పై కనిపించకపోయినా, తన గొంతు పాత్రతోనే *ఉత్తమ నటి*గా Rome Film Festival అవార్డు గెలిచింది.
* సినిమాలో చూపిన భవిష్య లాస్ ఏంజిలెస్ — టోక్యో, షాంఘై నగరాల మాదిరిగా చూపించారు.
* థియోడోర్ పాత్రను దర్శకుడు జోన్జ్ ప్రత్యేకంగా జోక్విన్ ఫీనిక్స్ కోసం రాశారు.


Wednesday, June 4, 2025

సువర్చలా కల్యాణం.. హనుమత్ కల్యాణం సందర్భంగా ప్రత్యేకంగా..

లోహాన్ని ఒరిపిడి పెట్టినట్లు సూర్యదేవుని దేహానికి ఒరిపిడి కలిగించి, ఆయన తేజస్సును కొంత తగ్గించాడు విశ్వకర్మ. ఆ తేజస్సు నుంచే విష్ణువుకు చక్రము, శివునికి త్రిశూలం మొదలైన ఆయుధాలను విశ్వకర్మ తయారుచేశాడు. ఇంకా కొంత సూర్యుని వర్ఛస్సు మిగిలింది. దానికి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. శక్తి స్త్రీస్వరూపం కాబట్టి ఆడపిల్ల అయింది. ఆ సూర్యవర్ఛస్సుకు సువర్చస్సు - సువర్చల అని పేరు పెట్టాడు. ఈ సుగుణవతి ఎవరికి భార్య అవుతుంది? అని ఇంద్రాదులు ప్రశ్నించినప్పుడు... "సూర్యుని ఫలమనే భ్రాంతితో పట్టబోయిన వానికి ఆమె భార్య కాగలద"ని సమాధానం చెప్పాడు. ఆయనే హనుమంతుడని అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుని బుద్ధి, విద్య, బలపరాక్రమాలు చూచి మెచ్చిన సూర్యభగవానుడు తన కుమార్తె అయిన సువర్చలను హనుమంతునకు ఇచ్చి వివాహం చేయదలచాడు. కానీ హనుమంతుడు బ్రహ్మచర్య వ్రతం పాటించదలిచానని చెప్పాడు. నీ బ్రహ్మచర్య నిష్ఠకు భంగం కాని రీతిలో ఆమెను స్వీకరించు అంటూ సూర్యభగవానుడు జ్యేష్ఠ శుద్ధ దశమినాడు సువర్చలా హనుమంతులకు కల్యాణం చేశాడు. రామాయణంలో హనుమంతుని కల్యాణం విషయం లేదు. పరాశర సంహిత వంటి గ్రంథాలలో కనిపిస్తుంది. హనుమంతుడు బ్రహ్మచారి అంటారు. ఈ వివాహం ఎలా జరిగిందనేది మరో ధర్మసందేహం. బ్రహ్మచర్యం నాలుగురకాలు. గాయత్రం, బ్రాహ్మం, ప్రాజాపత్యం, బృహన్ అని వాటికి పేర్లు. భార్యతో నియమపూర్వక జీవితం గడిపేవారిని ప్రాజాపత్య బ్రహ్మచారులంటారు. బ్రహ్మచర్య నియమాలను సరిగా అర్థం చేసుకోగలగాలి. హనుమంతుడు భవిష్యద్రృహ్మ. ఆయన బ్రహ్మస్థానం పొందిననాడు సువర్చలాదేవి సరస్వతీ స్థానం పొందుతుంది. దేవతల భార్యలంటే అర్ధం వారి శక్తులే. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠునికి ఉండే శక్తి వర్ఛస్సు అని పేరు. దానినే బహిర్ముఖంగా సువర్చలా దేవిగా భక్తులు ఆరాధిస్తారు.



వాల్మీకి రామాయణం -20

విశ్వామిత్రుడు దశరథునితో సంభాషిస్తూ....

రాజేంద్రా ! ధర్మమూ నీ పేరూ నీప్రతిష్ఠ ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటున్నట్లయితే మరి ఆలోచించక రాముణ్ని నాకు అప్పగించు. నీ మంత్రులూ వసిష్ఠప్రముఖులైన నీ పురోహితులూ హితులూ అంగీకరిస్తేనే నాతో పంపు. అయితే ఒక్కమాట .

ఈ యజ్ఞం దశరాత్రం. సమయం మించిపోకముందే ఒక నిర్ణయం తీసుకో. పుత్ర ప్రేమపట్ల, వియోగదుఃఖంపట్ల
మనస్సు పెట్టకు, నీకు శుభమగుగాక.

ఈ మాటలు వింటూనే దశరథునికి భయం ఆవరించింది. దు:ఖం ముంచుకు వచ్చింది. క్షణం నిశ్చేష్టుడయ్యాడు.

సింహాసనంలో ఇబ్బందిగా కదిలాడు. లేచి అటూ ఇటూ తిరిగాడు. ఎట్టకేలకు నోరువిప్పి మెల్లగా పలికాడు

నిండా పదహారు సంవత్సరాలు లేవు నా రామునికి. రాజీవలోచనుడైన అతడు రాక్షసులతో యుద్ధానికి తగినవాడని నేను అనుకోవడం లేదు....

ఊనషోడశవర్షోమే రామో రాజీవలోచనః
నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః

పుత్ర స్నేహంతో తడబడుతున్న మాటలతో దశరథుడు ఇలా పలికేసరికి కౌశికునికి కోపం వచ్చింది. అగ్నిలో
ఆజ్యం పోసినట్టయ్యింది.

రాజా ! ముందేమో ఏది అడిగితే అది చేస్తానన్నావు. తీరా అడిగాక ఇప్పుడేమో నావల్ల కాదంటున్నావు. ప్రతిజ్ఞాభంగానికి పాల్పడుతున్నావు.

ఇది రఘువంశంలో పుట్టిన వ్యక్తికి తగిన పనికాదు. సరే - ఇంతకూ ఇదే నీ తుది నిర్ణయమైతే - పోనీ - వచ్చిన దారినే వెళ్ళిపోతాను. కాకుత్స్థ ! మాట తప్పినవాడవై బంధుగణంతో హాయిగా సుఖంగా జీవించు

మహామునీ! ఇదిగో అక్షౌహిణీ సైన్యం. దీనికి నేను సర్వాధిపతిని. దీనితో నేనే కదలివస్తాను. నా సైనికులు అస్త్ర విశారదులు.

రాక్షసులతో యుద్ధం చెయ్యగలవారు. నేను స్వయంగా ధనుష్పాణినై వచ్చి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతాను. నీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది.

రాముడు మాత్రం వద్దు. వీడు బాలుడు. ఇంకా విద్య పూర్తి కానివాడు. బలాబలాలు ఎరగని వాడు. అస్త్ర బలం లేనివాడు.

యుద్దకౌశలం తెలియనివాడు. అవతల రాక్షసులేమో కూట యుద్ధంలో నేర్పరులు. వద్దు - రాముడు మాత్రం వద్దు.

పైగా నలుగురు బిడ్డలలోనూ నాకు రాముడంటేనే ప్రేమ ఎక్కువ. జ్యేష్ఠుడూ, ధర్మప్రధానుడూను మహర్షీ ! దయచేసి రాముణ్ని మాత్రం అడగవద్దు....

పైగా- నీయజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్న మారీచ సుబాహులు సుందోపసుందుల కొడుకులు.  వారితో యుద్ధం చెయ్యడానికి నా బిడ్డను పంపలేను...

( స‌శేష‌ము )..


వాల్మీకి రామాయణం -19

దశరథునితో తన యాగ రక్షణకు రాముణ్ణి పంపమని తెలుపుతూ విశ్వామిత్రుడు...

అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ |
వసిష్ఠోఽపిమహాతేజా యే చేమే తపసి స్థితాః

ధశరథుడు

ఏమయ్యా మహర్షి ! నా కొడుకు గురించి నాకే క్రొత్తగా చెప్పుచున్నావే ! నాకు తెలియదా ఆయన గురించి !

విశ్వామిత్రుడు

మహారాజా!! నీకు రాముని గురించి పూర్తిగా తెలియదు నీవు కేవలము సాధారణ బాహ్యనేత్రములతో చూడగల్గుతావు.

కేవలము వందిమాగధులతో పరివేష్టింపబడే నీకు శ్రీరామతత్వము తెలియదు. నిరంతర శస్త్రాస్తధారిపైన నీకు రాముని గురించి ఎలా తెలుస్తుంది ! భోగపరాయణుడవు.

రజోగుణయుక్తుడవు, సింహాసనోపవిష్ణుడవు. పుత్రవ్యామోహితుడవు అర్థకామపరుడవు, నీకు రామతత్వము అర్థమౌతుందా !

నేనోజ్ఞాననేత్రుడను. వృద్దోపసేవిని, జితేంద్రియుడను సాత్విక ప్రకృతి కలవాడను, ధర్మకార్యపరాయణుడను, యోగక్రమవేత్తను, మోక్షగామిని, నాకు అందువలననే రామతత్వము పూర్తిగా అర్థమైంది.

ధశరథుడు

మహామునీ ! నీకు సుకుమారుడైన నారాముని గురించి ఏమి తెలియునయ్యా ? వివరంగా తెవుపవయ్యా !

విశ్వామిత్రుడు

మహారాజా ! నీ కుమారుడు బాలుడే కావచ్చు. తేజస్వంతులకు వయస్సుతో నిమిత్తం లేదయ్యా ! నీ కొడుకు మహాత్ముడు ధైర్యశాలి.

శతృదుర్నిరీక్ష్యుడు. సకల ప్రాణులకు అభయదాత ! ఆయనతో సమానులే లోకంలో లేరంటే అధికుల మాట ఎక్కడిదయ్యా !

ఆయన  ధర్మసంస్థాపన కొరకే ప్రయత్నిస్తాడయ్యా ! ఆయనకు ఆగ్రహము వస్తే ఆయన అగ్ని కల్పుడు, సూర్యతేజుడు.

ఉపాయశాలి, మహావాయువువలె ఆయన  శతృవులను ఎగురగొట్టుతాడు.
ఆశ్రియుతులకాయన మృతసంజీవనము.

ధశరథుడు

"మీరు తెలిపే విశేషణాలన్ని భగవంతునికి వర్తిస్తాయి. అంతేగాని నా రామునికి వర్తిస్తాయా"?

విశ్వామిత్రుడు

చక్రవర్తి ! రాముడంటే ఎవ్వరనుకొంటున్నావు ? సాధారణ మానవ బాలుడు అనుకొంటున్నావా ? నిన్ను స్వయంగా తండ్రిగా వరించి, నీకు అవతరించిన పరమాత్మే ఆయన

"స,ఉ,శ్రేయాన్ భవతి జాయమానః " అని వేదము తెలిపినట్లు ప్రతి జన్మలో కూడ వివర్ధమాన తేజస్వి ఆయన

ధశరథుడు

మహానుభావా ! ఆయన పరమాత్మ అవునో కాదో నాకు తెలియదు. కాని నా రాముడింకా బాలుడే. యవ్వన మింకా అంకురించలేదు.

సౌకుమార్యము తగ్గలేదు. ఈయన పరాక్రమంతో శత్రువులతో పోరాడగలడా,…?

విశ్వామిత్రుడు

భూజానీ ! రాముడు సహజ పరాక్రముడు, ఆయన విక్రమము అమోఘము. ఆయన ముందుగా శత్రువులున్న చోటికే వెళ్లి వారిని

నిర్జింపగలుగుతాడు హఠాత్తుగా మీద బడ్డ ఎంతటి ప్రబల శత్రువునైనా మట్టి గరిపింపగల్గుతాడు (ప్రహర్త). సకల దేవతా సంరక్షకుడు శ్రీరాముడు.

భయంకర శతృవులనైనా క్షమింపగల ఉదారుడు. శతృవులనాయన ఎదిరించడానికి ఆయుధధారణము కూడ అవసరములేదు. సింహమువలెనిద్రాగతుడైనా అరిభయంకరుడే.

ధశరథుడు

మహర్షిపుంగవా ! మీరు మాట్లాడే ఈ మాటలు కేవలము మీ పనిని నెరవేర్చుకోవడానికి చెప్పేవి కావు కదా ! మీరే కాక నారాముని మీ వలె తెలిసిన వారింకెవ్వరైనా ఉన్నారా ? లేక మీరొక్కరేనా ?

విశ్వామిత్రుడు

మహిపాలా!నేనొక్కడినే ఎందుకయ్యా!మహాతేజుడు అయిన వశిష్ఠుడు కూడ రామతత్వము పూర్తిగా తెలిసినవాడే.

ఆయన నీ కులగురువే కదా? ఆయనను అడిగి చూడు నాకు విరుద్ధంగా మాట్లాడక ఆయన నామాటే అవునని అంటాడు.

వశిష్టుడు అబద్దం చెప్పుతాడా?ఆయన స్వయంగా బ్రహ్మపుత్రుడు
. శ్రీరామునికి ఆచార్యులు,

నావిషయంలో బ్రహ్మవరాన్ని బల పరుచగలిగిన మహాతేజశ్శాలి. సత్యధర్మ పరాయణుడు. ఆయన అబద్దం చెప్పుతాడా?

దశరథుడు

ఋషి శ్రేష్ఠా! నీవు, వసిష్ట మహాముని, ఇద్దరే కాక నా రాముని గురించి మీవలే తెలిసిన వారెవ్వరైనా అనేకులున్నారా?

విశ్వామిత్రుడు

ఇదుగో నీ ఎదుట మహర్షులు ఇందరు ఉన్నారు. కదా !  వారిని అడిగిచూడు ఒకరిద్దరయితే అనృతమాడవచ్చు కాని వీరందరు అసత్యము  పలుకుతారా?
వీరందరు అతి నిరాడంబరులు.

పరమభాగవత శిఖామణులు. వీరందరు నీ ఎదుటే ఉన్నారే వీరిని నీవే అడిగి చూడు.....

ఇంకా ఈ శ్లోక పరం గా పెద్దలు అనేక విధములైన వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు.....

( స‌శేష‌ము )..

ఆదివారం..మంగళవారం..దుర్గాపూజ ఎందుకు.. చేయాలంటే..!!

రాహువుకు శరీరమంతా విషమైతే.. తోకలో మాత్రం అమృతం ఉంటుందట..!!

మహిళలు మంగళ, శుక్రవారాల్లో దుర్గాపూజ చేస్తుంటారు. దుర్గాదేవిని మంగళ, శుక్రవారాల్లో భక్తిశ్రద్ధలతో పూజించి కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు.

యువతులైతే వివాహ ప్రాప్తి కోసం.. వివాహితులైతే దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం.

ముఖ్యంగా వారంలోని ఈ రెండు రోజుల్లో దుర్గాపూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది. రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహు కాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు అంటున్నారు.

దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో విష్ణు అవతార తిథులైన అష్టమి, నవమి తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా అమ్మవారిని..
అమావాస్య,
పౌర్ణమి,
మంగళ,
శుక్ర,
ఆదివారాల్లో
పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.

రాహు దోషం తొలగిపోవాలంటే....!! రాహు గ్రహానికి, దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది.

రాహు గ్రహానికి అధిదేవత దుర్గాదేవి.
అందుచేత రాహు కాలంలోనే దుర్గాపూజ జరుగుతోంది. ఆదివారం రాహు కాల పూజ విశిష్టమైనది. రాహువుకు శరీరమంతా విషంతో నిండివుంటుంది.

కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారివుంటుంది. అంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటలలోపు దుర్గాదేవిని పూజించినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

అనారోగ్య సమస్యలు, ఈతిబాధలు, రుణబాధలు తొలగిపోవాలంటే.. ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా గల ఆలయంలో ఒక నిమ్మపండును సగంగా కోసి.. నిమ్మరసాన్ని పిండేసి..

నిమ్మపండును ప్రమిదల్లా తిప్పి. అందులో నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపమెలిగించాలి. ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి.

ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లెపువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి. 

అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే పూజ చేయాలి. దీపం వెలిగించాక అమ్మవారిని మూడుసార్లు ప్రదక్షణ చేసుకుని నమస్కరించుకోవాలి.

దుర్గాస్తుతి చేయాలి. దుర్గాపూజ తర్వాత నవగ్రహ ప్రదక్షణలు కూడదు. ఇంటికొచ్చాక పూజగదిలో నెయ్యిదీపమెలిగించి..

ఐదు అగరవత్తులు, కర్పూరంతో పూజ చేయాలి. ఇలా తొమ్మిదివారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే.. కుజదోషాలు పటాపంచలవుతాయని పండితులు చెప్తున్నారు...